సోకాల్డ్ ప్రజా పాలనలో పిల్లల భవిష్యత్తు ఆందోళనకరం
వాంకిడి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైతే ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గమన్న హరీశ్‌రావు
ప్రభుత్వ నిర్లక్ష్యం గురుకుల విద్యార్థులకు శాపమవుతున్నది. సోకాల్డ్ ప్రజా పాలనలో అభం శుభం తెలియని పిల్లల భవిష్యత్తు ఆందోళనకరమౌతున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్ వేదికగా ఆరోపించారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైతే ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. స్థానికంగా ఉన్న ఆస్పత్రుల్లో పిల్లల్ని చేర్పించి చేతులు దులుపుకుంటున్నారని, మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం కూడా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక విద్యార్థిని వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని.. ఆ పరిస్థితికి చేరుకోవడానికి బాధ్యలు ఎవరు? అని ప్రశ్నించారు. సకాలంలో వైద్యం అందించడంలో అధికారులు ఎందుకు విఫలమయ్యారని నిలదీశారు. రోజురోజుకు దిగజారుతున్న గురుకుల పాఠశాలల పరిస్థితిని సరిదిద్దే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయడం లేదని విమర్శించారు. విద్యాశాఖను సీఎం రేవంత్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నా.. ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని హరీశ్ మండిపడ్డారు.