Telugu Global
Telangana

రెండో విడత సమీకృత గురుకులాల నిర్మాణాలకు నేడు శంకుస్థాపన

100 నియోజకవర్గాల్లో సుమారు రూ. 12 వేల కోట్లతో వాటిని నిర్మించనున్న సర్కార్‌

రెండో విడత సమీకృత గురుకులాల నిర్మాణాలకు నేడు శంకుస్థాపన
X

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్‌ ఇండియా సమీకృత గురుకులాల రెండో విడుత నిర్మాణాలకు నేడు ప్రభుత్వం శంకుస్థాపన చేయనున్నది. ప్రజాప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా రెండో విడత సమీకృత గురుకులాల నిర్మాణ పనులకు నేడు శ్రీకారం చుట్టనున్నారు. నేటి నుంచి ఈ నెల 30 వరకు స్థానిక మంత్రుల ఆధ్వర్యంలో ఆ శంకుస్థాపనలు కొనసాగనున్నాయి. 100 నియోజకవర్గాల్లో సుమారు రూ. 12 వేల కోట్లతో వాటిని నిర్మించనున్నారు.

అందరికీ మెరుగైన విద్యను అందిస్తామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. ఈమేరకు రాష్ట్రవ్యాప్తంగా యంగ్‌ ఇండియా సమీకృత గురుకులాలకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌ మినహా నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 100 సమీకృత గురుకులాలను నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తొలి విడతలో 28 గురుకులాలకు ప్రభుత్వం అక్టోబర్‌లో శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల మరో 26 సమీకృత గురుకులాలకు అనుమతులు ఇచ్చింది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నందున నేటి నుంచి ఈ నెల 9వ తేదీవరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా కొత్తగా మంజూరు చేసిన నియోజకవర్గాల్లో నేటి నుంచి ఈ నెల 30 వరకు స్థానిక మంత్రుల ఆధ్వర్యంలో నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్‌ గురుకులాలను ఒకేచోటికి తెస్తూ అందరికీ మెరుగైన విద్యను అందించే లక్ష్యంతో సర్కార్‌ సమీకృత గురుకులాలకు నాంది పలికింది. యంగ్‌ ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లన్నీ ఒకే డిజైన్‌లో ఉండేలా నిర్మాణాలు చేపట్టనున్నది. ఒక్కో గరుకులాన్ని సుమారు 20-25 ఎకరాల్లో రూ. 100-125 కోట్ల ఖర్చుతో నిర్మించాలని ప్రభుత్వం అంచనా వేసింది. సౌర, వాయు విద్యుత్‌ వినియోగం సహా వాననీటి సంరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. 1-12 వ తరగతి వరకు సుమారు 2560 మంది విద్యార్థులు , దాదాపు 120 మంది బోధన సిబ్బందికి సరిపోయేలా క్యాంపస్‌లను డిజైన్‌ చేశారు. ఒకేసారి 900 మంది విద్యార్థులు తినేలా డైనింగ్‌ హాల్‌, డిజిటల్‌ స్మార్ట్‌ బోర్డులు, కంప్యూటర్‌ ల్యాబ్‌లు, లైబ్రరీలు, లాబోరేటరీలు, క్రికెట్‌, ఫుట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌ కోర్టులతో పాటు టెన్నిస్‌ కోర్టులు, ఔట్‌ డోర్‌ జిమ్‌తో మినీ ఎడ్యుకేషన్‌ హబ్‌లా ఉండేలా సమీకృత గురుకులాలను తీర్చిదిద్దాలని సర్కార్‌ భావిస్తున్నది. ఈ ఏడాది 5 వేల కోట్లతో గురుకుల క్యాంపస్‌లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో భాగంగా రెండో విడుత గురుకులాలకు నేడు శ్రీకారం చుట్టునున్నది. కొత్తవాటితో కలుపుకుంటే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 54 చోట్ల గురుకులాల నిర్మాణం ప్రారంభకానున్నాయి. మిగతాచోట్ల సరైన స్థలాన్ని గుర్తించి త్వరలోనే నిర్మాణాలు మొదలుపెడుతామని ప్రభుత్వం చెబుతున్నది.

First Published:  1 Dec 2024 11:41 AM IST
Next Story