Telugu Global
Telangana

రాబోయే ఆరు నెలలు ఎన్నికలపైనే ఫోకస్.. పార్టీని సమాయత్తం చేయనున్న సీఎం కేసీఆర్

అక్టోబర్, నవంబర్‌లో ఎన్నికలు ఉంటాయని.. అందుకు పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని గతంలోనే సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

రాబోయే ఆరు నెలలు ఎన్నికలపైనే ఫోకస్.. పార్టీని సమాయత్తం చేయనున్న సీఎం కేసీఆర్
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్, డిసెంబర్ నెలల్లో జరిగే అవకాశం ఉందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచనప్రాయంగా తెలిపారు. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంతో ఉన్నది. సీఎం కేసీఆర్ ఇందుకు సంబంధించిన వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం పరంగా చేయాల్సిన కార్యక్రమాలన్నీ ఇప్పటికే పూర్తి చేశారు. రాబోయే ఆరు నెలలు పూర్తిగా ఎన్నికలపైనే ఫోకస్ పెట్టనున్నారు.

బీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేయాల్సిన పనులన్నింటినీ కేసీఆర్ కంప్లీట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, కొత్త సచివాలయం వంటి కీలకమైన అభివృద్ధి కార్యక్రమాలు కళ్ల ముందు కనపడుతున్నాయి. ఇక రైతు బంధు, దళిత బంధు వంటి పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు. దళిత బంధుకు సంబంధించి త్వరలోనే రెండో దఫా యూనిట్లు కూడా పంపిణీ అవుతాయి. అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల నిర్మాణం కూడా పూర్తయ్యింది.

పోడు భూములకు సంబంధించిన హక్కు పత్రాల సమస్యను కూడా పరిష్కరించారు. త్వరలోనే లబ్దిదారులకు పట్టాలు అందనున్నాయి. ఇక హైదరాబాద్ పరిధిలో ఉన్న జీవో 58, 59 సమస్యను కూడా తీర్చారు. స్థలాల క్రమబద్దీకరణకు నెల రోజుల గడువు కూడా ఇచ్చారు. దీని వల్ల ఎంతో మంది పేదల స్థలాల సమస్య ఒకేసారి పరిష్కారం అయ్యింది. హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి గత ఐదేళ్ల పాలనలో వేగం పెరిగిందనే చెప్పవచ్చు. టీ-హబ్ రెండో దశ, టీ-వర్క్స్, కమాండ్ కంట్రోల్ సెంటర్, ఫ్లైవోవర్ల నిర్మాణం పూర్తయ్యాయి. ఎన్నో ఫార్మా, ఐటీ కంపెనీలు హైదరాబాద్‌కు క్యూకట్టాయి.

రాష్ట్రంలో వైద్యరంగాన్ని బలోపేతం చేయడానికి సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీ మంజూరు చేశారు. ఇప్పటికే చాలా మెడికల్ కాలేజీలకు అనుమతులు కూడా వచ్చాయి. వరంగంల్‌లో హెల్త్ సిటీ దాదాపు పూర్తి కావొస్తోంది. హైదరాబాద్‌లో నలుదిక్కులా నిర్మిస్తున్న టిమ్స్ నిర్మాణాలు కూడా పూర్తవుతున్నాయి. త్వరలోనే నిమ్స్ విస్తరణకు కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ప్రభుత్వ పరంగా చేయాల్సిన పనులన్నీ పూర్తి చేసిన కేసీఆర్.. ఇక ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే పనిలో పడ్డారు.

అక్టోబర్, నవంబర్‌లో ఎన్నికలు ఉంటాయని.. అందుకు పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని గతంలోనే సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాలకు వెళ్లి అందరూ పనులు చేసుకోవాలని.. ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే పనిలో ఉండాలని గతంలోనే ఆదేశించారు. పార్టీ కార్యక్రమాల పట్ల ఎటువంటి నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి పార్టీలో కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేశారు. ఇక త్వరలో యువ సమ్మేళనాలు నిర్వహించనున్నారు. దీని ద్వారా సంక్షేమ పథకాల పరిధిలో లేని యువతకు తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ఉద్యోగాల భర్తీ గురించి వివరించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా.. అందుకు పార్టీ సిద్ధంగా ఉండాలని చెబుతున్నారు. సోషల్ మీడియాలో కూడా చురుకుగా ఉండాలని, ప్రతిపక్షాలు చేసే ఆరోపణలను అన్ని వేదికల్లో ఖండించాలని ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సూచించారు. రాబోయే ఆరు నెలలు పూర్తిగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపైనే బీఆర్ఎస్ ఫోకస్ చేయనున్నది. జిల్లాల వారీగా సమీక్షలు చేయడానికి కూడా కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ఓపెనింగ్‌కు వెళ్లి వచ్చిన తర్వాత.. ఈ సమీక్ష సమావేశాలు అధ్యక్షులు కేసీఆర్ నిర్వహిస్తారని తెలుస్తోంది. ఏయే నియోజకవర్గాల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలో స్థానిక నాయకులకు సూచించనున్నట్లు సమాచారం.

First Published:  4 May 2023 3:35 AM
Next Story