Telugu Global
Telangana

కొత్త స‌చివాలయంలో.. తొలి భేటీ.. - 18న తెలంగాణ‌ మంత్రి వ‌ర్గ స‌మావేశం

కొత్త స‌చివాల‌యం ఎదుట సిద్ధం చేసిన తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభ తేదీని ఈ సంద‌ర్భంగా ఖరారుచేసే అవకాశముంది.

కొత్త స‌చివాలయంలో.. తొలి భేటీ.. - 18న తెలంగాణ‌ మంత్రి వ‌ర్గ స‌మావేశం
X

తెలంగాణ కొత్త స‌చివాల‌యంలో రాష్ట్ర మంత్రి వ‌ర్గ తొలి భేటీ ఈ నెల 18వ తేదీ గురువారం నాడు జ‌ర‌గ‌నుంది. ఆరోజు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగే స‌మావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వ ద‌శాబ్ది ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌పై చ‌ర్చించ‌నున్నారు. ఈ వేడుక‌లు రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజుల పాటు నిర్వ‌హించాల‌ని, జూన్ 2 నుంచి వాటిని ప్రారంభించాల‌ని ఇప్ప‌టికే ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే.

పేద‌ల‌కు ఇళ్ల ప‌ట్టాల పంపిణీపైనా చ‌ర్చ‌...

ఈ ఉత్స‌వాల ఏర్పాట్ల‌పై ఈ స‌మావేశంలో చ‌ర్చించి, మంత్రులు, అధికారుల‌కు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయ‌నున్నారు. కొత్త స‌చివాల‌యం ఎదుట సిద్ధం చేసిన తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభ తేదీని ఈ సంద‌ర్భంగా ఖరారుచేసే అవకాశముంది. దీంతో పాటు పోడు పట్టాల పంపిణీ తేదీలు, గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలను ప్రకటించి అమలు కార్యాచరణ ప్రకటించే అవకాశం కూడా ఉంది. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ విష‌యంపైనా స‌మావేశంలో చ‌ర్చించే అవ‌కాశ‌ముంద‌ని ఆ పార్టీ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.

ఎమ్మెల్సీ స్థానాల‌కు పేర్లు ఖ‌రారు చేసే అవ‌కాశం..

ఈ నెల 27వ తేదీతో ప‌ద‌వీకాలం ముగియ‌నున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు రాజేశ్వరరావు, ఫారూఖ్ హుస్సేన్ ల స్థానంలో అభ్య‌ర్థుల పేర్ల‌ను మంత్రి వ‌ర్గ స‌మావేశంలో చ‌ర్చించి ఆమోదించే అవ‌కాశ‌మున్న‌ట్టు తెలుస్తోంది. అనంత‌రం గ‌వ‌ర్న‌ర్‌కు ఆయా పేర్ల‌ను సిఫార‌సు చేస్తార‌ని స‌మాచారం.

గ‌వ‌ర్న‌ర్ వెన‌క్కి పంపిన బిల్లుల‌పైనా చ‌ర్చ‌..

గ‌వ‌ర్న‌ర్ ఆమోదం కోసం పంపిన బిల్లుల్లో రెండింటిని వెన‌క్కి పంపిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వాటిపైనా మంత్రి వ‌ర్గ స‌మావేశంలో చ‌ర్చించే అవ‌కాశ‌ముంద‌ని తెలుస్తోంది. వాటితో పాటు ఇత‌ర బిల్లుల‌పైనా చ‌ర్చించే అవ‌కాశ‌ముంద‌ని స‌మాచారం. వెన‌క్కి వ‌చ్చిన బిల్లుల‌ను మ‌ళ్లీ పంపాల‌ని స‌మావేశంలో నిర్ణ‌యిస్తే.. అందుకోసం ఉభ‌య స‌భ‌ల‌ను స‌మావేశ‌ప‌ర‌చాల్సి ఉంటుంది. ఆ విష‌యంపైనా కేబినెట్‌లో నిర్ణ‌యించే అవ‌కాశ‌ముంది.

శాస‌న‌స‌భ ఎన్నిక‌ల పైనా..

క‌ర్నాట‌క ఎన్నిక‌లు ఇటీవ‌లే పూర్త‌వ‌డంతో రానున్న తెలంగాణ రాష్ట్ర శాస‌న‌స‌భ ఎన్నిక‌ల పైనా ఈ స‌మావేశంలో చ‌ర్చించే అవకాశ‌ముంది. క‌ర్నాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను అంచ‌నా వేసుకుని రాష్ట్రంలో రానున్న ఎన్నిక‌ల‌కు ప్ర‌ణాళిక‌పై మంత్రివ‌ర్గ భేటీలో చ‌ర్చించే అవ‌కాశ‌ముంద‌ని స‌మాచారం.

First Published:  17 May 2023 6:57 AM IST
Next Story