Telugu Global
Telangana

ప్రభుత్వ అబద్ధపు ప్రచారాన్ని పటాపంచలు చేస్తా

మొన్ననే లేఖ రాసి ఉంటే ఎందుకు బయట పెట్టలే : హరీశ్‌ రావు

ప్రభుత్వ అబద్ధపు ప్రచారాన్ని పటాపంచలు చేస్తా
X

కేసీఆర్‌ పై, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని పూర్తి వాస్తవాలతో పటాపంచలు చేస్తానని మాజీ మంత్రి హరీశ్‌ రావు సవాల్‌ విసిరారు. తన ప్రెస్‌మీట్‌ తర్వాత మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మేల్కొన్నారని, పాత డేట్‌ (2025 జనవరి 22)తో ఈరోజు లేఖ విడుదల చేశారని ఎద్దేవా చేశారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులు, కృష్ణా ట్రిబ్యునల్‌ పై తాను ప్రెస్‌మీట్‌ పెట్టిన తర్వాత మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి ఆరోపణలు చేయడంపై హరీశ్‌ రావు 'ఎక్స్‌' వేదికగా స్పందించారు. మంత్రి ఉత్తమ్‌ 22వ తేదీన్నే కేంద్రానికి లేఖ రాసి ఉంటే ఆ రోజే మీడియాకు రిలీజ్‌ చేసేవారు కదా ఎందుకు దాచిపెట్టారని ప్రశ్నించారు. గోదావరి - కృష్ణా - పెన్నా లింక్‌పై ఏపీ సీఎం 2024 నవంబర్‌ 15న మొదటి లేఖ, డిసెంబర్‌ 31న రెండో లేఖ రాశారని.. ఈ రోజు వరకు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదో చెప్పాలన్నారు. ''గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై నా వ్యాఖ్యలను మీరు వక్రీకరించడం శోచనీయం. నేను 200 టీఎంసీలు తీసుకుపోతున్నారని ఎక్కడ అన్నాను. తీసుకుపోయేందుకు ప్రాజెక్టు రూపకల్పన చేస్తుంటే మీరు మౌనం వహిస్తున్నారని తప్పుబట్టాను. తెలంగాణ నీటి ప్రయోజనాల కోసం నేను ప్రశ్నిస్తే గానీ, మీ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడదనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది.. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాలు 511 : 299 టీఎంసీలు అనేది ఒక్క ఏడాదికి చేసుకున్న అగ్రిమెంట్‌ అని మీరు విడుదల చేసిన డాక్యుమెంట్లలోనే స్పష్టంగా ఉంది.. మంత్రి హోదాలో ఉండి ఎందుకు అబద్దాలు చెబుతున్నారు..'' అని ప్రశ్నించారు.

తెలంగాణ ఆవిర్భవించిన తొలినాళ్లలోనే సెక్షన్‌ -3 ప్రకారం కృష్ణా నీళ్ల పంపిణీని ట్రిబ్యునల్‌ కు అప్పగించాలని తాము పోరాడామన్నారు. ''ట్రిబ్యునల్ సమావేశానికి మంత్రి హోదాలో హాజరైన మొదటి వ్యక్తి నేనొక్కడినే అని మరో అబద్దం చెబుతున్నారు. 2016లోనే ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్, ఇరిగేషన్ మంత్రిగా నేను ట్రిబ్యునల్ మీటింగ్ లో పాల్గొని తెలంగాణ పక్షాన కొట్లాడినం. మీటింగ్ మినట్స్ లో ఉంటది చూసుకోండి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలోనూ నోటికి వచ్చిన అబద్దాలు చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును వ్యతిరేకించలేదనేది పచ్చి అబద్దం. ఇదే అబద్దాన్ని పదే పదే చెబుతున్నారు. అప్పటి ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించిన నాటి నుంచే వ్యతిరేకిస్తూ పుంఖానుపుంఖాలుగా లేఖలు రాశాం. కేఆర్ఎంబీకి, కేంద్ర ప్రభుత్వానికి, జలశక్తి మంత్రి షెకావత్ కు ఎన్నో ఉత్తరాలు రాసినం. మేం చేసిన ఒత్తిడితోనే రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు చేయొద్దని జలశక్తి మంత్రి షెకావత్ ఏపీకి లేఖ రాశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మౌనంగా ఉన్నదని చెప్పడం అవాస్తవం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో స్టే తెచ్చినం. సెకండ్ అపెక్స్ కౌన్సిల్ లో వ్యతిరేకంగా మాట్లాడినవి మీటింగ్ మినట్స్ లో ఉన్నాయి.. నేను పంపిస్తున్నా చూసుకోండి.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగి ఉన్నాయంటే అది బీఆర్ఎస్ చేసిన కృషి వల్లనే అన్నది దాచేస్తే దాగని సత్యం.. నేను మాట్లాడింది గోదావరి జలాల్లో జరుగుతున్న అన్యాయం గురించి అయితే, ఆ విషయం మాట్లాడకుండా ఏవోవో మాట్లాడి, డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు.. మీరు చెప్పిన అబద్దాలకు పూర్తి వాస్తవాలతో పత్రికా సమావేశం నిర్వహిస్తాను. మీ అబద్దపు ప్రచారాన్ని పటాపంచలు చేస్తాను..'' అని తేల్చిచెప్పారు.

First Published:  24 Jan 2025 9:15 PM IST
Next Story