Telugu Global
Telangana

కేసీఆర్ పెట్టిన పార్టీలోకి నేనెందుకెళ్లాలి అన్నాడు.. ఇవ్వాళ ఒక కార్యకర్త కింద పని చేస్తున్నాడు!

బ్రహ్మాండంగా ఉన్న కెరీర్‌లో చేసే చిన్న తప్పులు రాజకీయ సమాధి చేసేయవచ్చు. అలాంటివి మన కళ్ల ముందే ఎన్నో చూశాం. చూస్తున్నాము కూడా.

కేసీఆర్ పెట్టిన పార్టీలోకి నేనెందుకెళ్లాలి అన్నాడు.. ఇవ్వాళ ఒక కార్యకర్త కింద పని చేస్తున్నాడు!
X

రాజకీయాల్లో హత్యలు ఉండవు కేవలం ఆత్మహత్యలే ఉంటాయనే నానుడి ఉంది. ఒకప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పిన నాయకుడు ఇవ్వాళ గెలిచేందుకే ఆపసోపాలు పడొచ్చు. ఒకనాడు అగ్రనేతగా ఉన్న వ్యక్తి.. నేడు టికెట్ కోసం అడుక్కునే స్థితి రావొచ్చు. బ్రహ్మాండంగా ఉన్న కెరీర్‌లో చేసే చిన్న తప్పులు రాజకీయ సమాధి చేసేయవచ్చు. అలాంటివి మన కళ్ల ముందే ఎన్నో చూశాం. చూస్తున్నాము కూడా. ఇప్పుడు అలాంటి పరిస్థితే నాగం జనార్థన్ రెడ్డికి వచ్చింది.

చంద్రబాబు హయాంలో నాగం జనార్థన్ రెడ్డి ఒక వెలుగు వెలిగారు. తెలంగాణ ప్రాంతంలో నాగం జనార్థన్ రెడ్డి, దేవేందర్ గౌడ్ పార్టీలో నెంబర్ టూ పొజిషన్‌లో ఉండేవారు. ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తాన్ని నాగం జనార్థన్ రెడ్డి అప్పట్లో తన చేతిలో పెట్టుకొని ఆటాడించారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఆనాడు టాప్ పొజిషన్‌లో ఉన్న నాగం.. చివరకు టికెట్ కూడా రాని పరిస్థితిని ఎదుర్కుంటున్నారు.

టీడీపీలో నాగం అగ్రనాయకుడిగా వెలుగొందుతున్న రోజుల్లో ఇప్పటి సీఎం కేసీఆర్ సాధారణ ఎమ్మెల్యే. తెలంగాణ కోసం పార్టీని వీడి కేసీఆర్ రాజకీయ పార్టీని స్థాపించారు. టీఆర్ఎస్ పార్టీ ద్వారా తెలంగాణ సాధించి.. గత తొమ్మిదిన్నర ఏళ్లుగా తెలంగాణకు సీఎంగా ఉన్నారు. కేసీఆర్ పార్టీ పెట్టిన కొత్తలోనే చాలా మంది టీడీపీ నాయకులు తెలంగాణ కోసం టీఆర్ఎస్‌లో చేరారు. అయితే నాగం జనార్థన్ రెడ్డి మాత్రం.. నా కింద పని చేసిన (కేసీఆర్ సాధారణ ఎమ్మెల్యే, నాగం మంత్రిగా ఉన్నాడు) వ్యక్తి పెట్టిన పార్టీలోకి నేను వెళ్లను అంటూ బహిరంగంగానే వ్యాఖ్యానించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా చంద్రబాబు చెప్పినట్లు ఆడి.. ఉద్యమకారుల ఆగ్రహానికి గురయ్యారు. ఓయూకు వెళ్లి దెబ్బలు తిన్న చరిత్ర కూడా నాగం జనార్థన్ రెడ్డికి ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత నాగం పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. చివరకు టీడీపీని వీడి బీజేపీలోకి వచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లోకి మారిపోయారు.

నాగర్‌కర్నూల్ నుంచి వరుసగా గెలిచిన చరిత్ర ఉన్న నాగం జనార్థన్ రెడ్డి.. ఇప్పుడు అదే టికెట్ ఆశించి భంగపడ్డారు. నాగం టీడీపీలో టాప్ పొజిషన్‌లో ఉన్నప్పుడు ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్‌లో సాధారణ కార్యకర్తగా ఉండేవారు. రేవంత్ క్రమంగా ఎదిగి ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. ఆనాటి కార్యకర్త చీఫ్‌గా ఉన్న పార్టీలోనే నాగం జనార్థన్ రెడ్డి టికెట్ కోసం చేతులు చాచాల్సిన పరిస్థితికి వచ్చింది. ఇదంతా నాగం జనార్థన్ రెడ్డి సొంతగా చేసుకున్నదే అని.. ఆనాడు టీఆర్ఎస్‌లోకి వెళ్లకూడదని తీసుకున్న నిర్ణయమే.. నాగం రాజకీయ కెరీర్‌ను మసకబార్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

First Published:  18 Oct 2023 2:52 AM GMT
Next Story