Telugu Global
Telangana

రేవంత్ సర్కార్‌కు సవాల్‌.. ముదురుతున్న కొత్త హైకోర్టు లొల్లి

అధికారంలోకి వచ్చిన తర్వాత స్వల్పకాలంలోనే కాంగ్రెస్‌ తీసుకున్న ఈ నిర్ణయం వివాదాస్పదమైంది. ఈ సమస్యకు పరిష్కారం చూపడం ఇప్పుడు రేవంత్‌ సర్కార్‌కు సవాల్‌గా మారింది.

రేవంత్ సర్కార్‌కు సవాల్‌.. ముదురుతున్న కొత్త హైకోర్టు లొల్లి
X

తెలంగాణ కొత్త హైకోర్టు నిర్మాణానికి బుద్వేల్‌లో వంద ఎకరాలు కేటాయిస్తూ రేవంత్ సర్కార్‌ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. ఈ వివాదం రోజురోజుకూ మరింత ముదురుతోంది. హైకోర్టు నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించిన భూముల్లో రాజేంద్రనగర్ అగ్రికల్చర్ వర్సిటీ ఏళ్లు తరబడి అభివృద్ధి చేసిన బయోడైవర్సిటీ పార్క్ ఉండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై అగ్రికల్చర్ వర్సిటీ సిబ్బంది, విద్యార్థులతో పాటు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రేవంత్ సర్కార్‌ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యూనివర్సిటీ విద్యార్థులు దాదాపు మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. హైకోర్టుకు 100 ఎకరాల వర్సిటీ భూములు కేటాయిస్తూ జారీ చేసిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

హైకోర్టును సిటీ శివారుకు తరలించాలన్న నిర్ణయంపై న్యాయవాదుల్లోనూ భిన్నాభిప్రాయాలున్నాయి. హైకోర్టును బుద్వేలుకు తరలిస్తే ఇబ్బందులు తప్పవని ఓ వర్గం అభిప్రాయపడుతుంది. కేసుల కోసం వచ్చే సామాన్యులు అక్కడి వరకు రావాలంటే వ్యయ,ప్రయాసలు తప్పవంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచించాలని డిమాండ్ చేస్తున్నారు. హైకోర్టుకు వంద ఎకరాల స్థలం అవసరం లేదన్న మరో అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

అధికారంలోకి వచ్చిన తర్వాత స్వల్పకాలంలోనే కాంగ్రెస్‌ తీసుకున్న ఈ నిర్ణయం వివాదాస్పదమైంది. ఈ సమస్యకు పరిష్కారం చూపడం ఇప్పుడు రేవంత్‌ సర్కార్‌కు సవాల్‌గా మారింది. విద్యార్థులు, పర్యావరణవేత్తలు, న్యాయవాదుల అభిప్రాయాలను ప్రభుత్వం లెక్కలోకి తీసుకుంటుందా..లేదా మొండిగా ముందుకు వెళ్తుందా అనేది తేలాల్సి ఉంది.

First Published:  11 Jan 2024 1:17 PM IST
Next Story