Telugu Global
Telangana

రేవంత్‌ తెచ్చిన అప్పు 10 నెలల్లో రూ.80,500 కోట్లు

అప్పు తప్పు అన్నోళ్లను ఇప్పుడు దేనితో కొట్టాలి : కేటీఆర్‌

రేవంత్‌ తెచ్చిన అప్పు 10 నెలల్లో రూ.80,500 కోట్లు
X

రేవంత్‌ రెడ్డి గద్దె నెక్కిన రోజు నుంచి పది నెలల్లో రూ.80,500 కోట్ల అప్పు తెచ్చారని, రికార్డు స్థాయిలో అప్పులు తెచ్చి దేనికి ఖర్చు చేశారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ 'ఎక్స్‌' వేదికగా ప్రశ్నించారు. అప్పు చేయడమే తప్పు అన్నోళ్లను ఇప్పుడు దేనితో కొట్టాలని ప్రశ్నించారు. కొత్తగా ఒక్క ప్రాజెక్టు కట్టలేదని.. ఎన్నికల హామీలు నెరవేర్చలేదని.. అలాంటప్పుడు అప్పు తెచ్చిన రూ.80 వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని ప్రశ్నించారు. బడా కాంట్రాక్టర్ల బిల్లులకు ఆ మొత్తం ధారాదత్తం చేశారా? కమీషన్లకు కక్కుర్తి పడే అప్పులు తెస్తున్నారా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అప్పులతో ప్రాజెక్టులు నిర్మించామని, ప్రతి పైసా మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేశామన్నారు. తెచ్చిన అప్పులతో దశాబ్దాల కష్టాలు తీర్చామన్నారు. రుణమాఫీ చేయకుండా, రైతుభరోసా ఇవ్వకుండా.. ఒక్క ప్రాజెక్టు కట్టకుండా.. నెలల పాటు జీతాలు ఇవ్వకుండా ఇన్ని వేల కోట్లు ఏం చేశారని నిలదీశారు. రాష్ట్రంలో సంపద సృష్టించే ప్రయత్నం చేయకుండా సొంత ఆస్తులు పెంచుకోవడానికి అప్పులు చేయడం క్షమించరాని నేరమన్నారు. ఈ అప్పులు రాష్ట్ర భవిష్యత్‌ కే పెను ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు.

First Published:  16 Oct 2024 12:43 PM IST
Next Story