ముగిసిన ఉపసంహరణ గడువు.. మిగిలింది 2,297 మంది అభ్యర్థులు..!
ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో అత్యధికంగా 70 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నారు. గజ్వేల్‌లో 44 అభ్యర్థులు పోటీలో నిలిచారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య తేలిపోయింది. బుధవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. అసెంబ్లీ ఎన్నికల బరిలో 2,297 మంది అభ్యర్థులు మిగిలారు. బుధవారం దాదాపు 601 మంది నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో అత్యధికంగా 70 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నారు. గజ్వేల్‌లో 44 అభ్యర్థులు పోటీలో నిలిచారు.
ఇక సీఎం పోటీ చేస్తున్న మరో నియోజకవర్గం కామారెడ్డిలో 39 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మేడ్చల్‌లో 45 మంది నామినేషన్లను విత్‌డ్రా చేసుకున్నారు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో 335 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
9 అసెంబ్లీ స్థానాలున్న నిజామాబాద్ జిల్లాలో అతి తక్కువగా 144 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. విత్‌డ్రా గడువు ముగియడంతో స్వతంత్రులకు గుర్తులు కేటాయించారు అధికారులు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు 30వ తేదీన పోలింగ్ జరగనుంది.