Telugu Global
Telangana

వైద్యరంగంలో తెలంగాణను దేశం అనుసరిస్తుంది -కేసీఆర్

Medical Colleges In Telangana: అన్ని రంగాల్లో తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుందని చెప్పిన కేసీఆర్ వైద్యరంగంలో కూడా తెలంగాణను దేశం అనుసరిస్తుందన్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా 8 మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి.

వైద్యరంగంలో తెలంగాణను దేశం అనుసరిస్తుంది -కేసీఆర్
X

తెలంగాణ వైద్య రంగంలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా 8 మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. ప్రగతి భవన్ నుంచి వర్చువల్ గా ఈ కాలేజీలను ప్రారంభించిన కేసీఆర్ దీన్ని దేశ చరిత్రలోనే ఒక అరుదైన సందర్భం అని వర్ణించారు.

అన్ని రంగాల్లో తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుందని చెప్పిన కేసీఆర్ వైద్యరంగంలో కూడా తెలంగాణను దేశం అనుసరిస్తుందన్నారు. ఇది రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాల్లో లిఖించ దగిన రోజని, ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారులుండటం వల్లే ఇది సాధ్యమైందని కేసీఆర్ అన్నారు. మన ఎంచుకున్న లక్ష్యం ప్రకారం ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ప్రారంభించి తీరుతామని, రెండేళ్ళలో మరో 17 కాలేజీలు ప్రారంభిస్తామని, ఆ మేరకు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం కూడా తెలిపిందన్నారు కేసీఆర్.

ఉమ్మడి రాష్ట్రంలో MBBS సీట్లు 850 ఉండేవని,ఇప్పుడు వాటిని 2790 కి పెంచుకున్నామన్నారు కేసీఆర్. పీజీ , సూపర్ స్పెషాలిటీ సీట్లు కూడా గణనీయంగా పెంచుకున్నామని చెప్పిన కేసీఆర్ గతంలో 215 పీజీ సీట్లు ఉంటే 1180 కి, 70 సూపర్ స్పెషాలిటీ సీట్లు ఉంటే ఇప్పుడు 152 కి పెరిగాయని కేసీఆర్ తెలిపారు.

''జనాభాకు తగ్గ సరైన నిష్పత్తి లో డాక్టర్లతో పాటు పారా మెడికల్ సిబ్బంది కూడా అవసరం ప్రతి జిల్లాకి నర్సింగ్ కాలేజీలు పెడుతున్నాం. ఇతర పారా మెడికల్ కోర్సులను కూడా త్వరగా ప్రారంభించాలని, వైద్య శాఖ మంత్రిని, అధికారులను కోరుతున్నాను.'' అని కేసీఆర్ అన్నారు.

''వైద్య సదుపాయాలను పెంచుకుంటే తప్ప కరోనా వంటి మహమ్మారులు వచ్చినప్పుడు ప్రజలను రక్షించలేం. ఎక్కడైతే వైద్య వ్యవస్థ పటిష్టంగా ఉంటుందో అక్కడే మానవవనరులను కాపాడుకోగలుగుతాం. '' అని కేసీఆర్ స్పష్టం చేశారు.

First Published:  15 Nov 2022 12:47 PM IST
Next Story