Telugu Global
Telangana

దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రి నిర్మాణం.. 14న శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్

రూ.1,570 కోట్ల వ్యయంతో 2,100 పడకల ఆసుపత్రిని నిర్మించనున్నారు. ప్రస్తుతం నిమ్స్‌కు 1,300 పడకల ఆసుపత్రి ఉన్నది. దీనికి అదనంగా భారీ భవనాన్ని నిర్మించనున్నారు.

దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రి నిర్మాణం.. 14న శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్
X

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి భవనానికి తెలంగాణ వేదిక కానున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) అనుబంధ ఆసుపత్రి ఈ మేరకు రికార్డు సృష్టించనున్నట్లు అధికారులు తెలిపారు. నిమ్స్‌కు అనుబంధంగా భారీ ఆసుపత్రి భవనాన్ని నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ప్రభుత్వం 32 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. కాగా, అందులో కొంత స్థలం నిర్మాణాలకు అనుకూలంగా లేదు. మిగిలిన ప్రాంతంలో రోడ్లు, ఇతర నిర్మాణాలు ఉన్నాయి. దీంతో 26 ఎకరాల స్థలంలో భారీ భవంతిని నిర్మించడానికి అధికారులు భూమిని చదును చేస్తున్నారు.

రూ.1,570 కోట్ల వ్యయంతో 2,100 పడకల ఆసుపత్రిని నిర్మించనున్నారు. ప్రస్తుతం నిమ్స్‌కు 1,300 పడకల ఆసుపత్రి ఉన్నది. దీనికి అదనంగా భారీ భవనాన్ని నిర్మించనున్నారు. ఇది పూర్తి అయితే దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి భవనంగా రికార్డు సృష్టిస్తుందని అధికారులు తెలిపారు. ఈ ఆసుపత్రి భవనం 25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండనున్నది. భవనంతో పాటు పార్కింగ్ సౌకర్యం, పచ్చదనానికి పెద్ద పీట వేయనున్నారు.

సీఎం కేసీఆర్ ఈ నెల 14న ఈ భారీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు ముమ్మరం చేశారు. త్వరలోనే ఆసుపత్రి నిర్మాణానికి టెండర్లు పిలవనున్నారు. టెండర్ దక్కించుకున్న సంస్థ 36 నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే.. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం నిమ్స్‌లో లేని వైద్య విభాగాలు కూడా కొత్త భవంతి నిర్మాణ పూర్తయ్యాక అందుబాటులోకి రానున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి అత్యంత ప్రాముఖ్యతను ఇస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆసుపత్రులను అప్‌గ్రేడ్ చేస్తోంది. వైద్య పరికరాల కొనుగోలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం చేసింది. హైదరాబాద్ నగరం చుట్టూ నాలుగు టిమ్స్ ఆసుపత్రులను నిర్మిస్తోంది. సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్ ఆసుపత్రుల నిర్మాణం వేగంగా జరుగుతోంది. వైద్య రంగంలో ఇన్ని ఆసుపత్రుల నిర్మాణం ఒకే సారి చేపడుతున్నది తెలంగాణ ప్రభుత్వం మాత్రమే.

First Published:  8 Jun 2023 2:23 AM GMT
Next Story