ఎటూ తేల్చని కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటి.. మరో సారి భేటీ కావలని నిర్ణయం!
ఉదయం నుంచి సుదీర్ఘంగా సమాలోచనలు చేసినా.. కేవలం 35 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల విషయంలో మాత్రమే ఒక కొలిక్కి రాగలిగారు
నాకు టికెట్ వస్తుంది.. మా నాయకుడికి టికెట్ కన్ఫార్మ్.. ఇదిగో తొలి లిస్టు.. అంటూ నాయకుల నుంచి మీడియా వరకు రోజంతా ఎదురు చూసినా.. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ మాత్రం ఎటూ తేల్చకుండా సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేయడానికి ఏఐసీసీ నియమించిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ మూడు రోజుల నుంచి హైదరాబాద్‌లోనే ఉన్నది. సోమ, మంగళవారాల్లో అభిప్రాయ సేకరణ, సంప్రదింపులు జరిపిన స్క్రీనింగ్ కమిటీ.. బుధవారం తాజ్ కృష్ణ హోటల్‌లో కీలక భేటీ నిర్వహించింది.
స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన జరగిన సమావేశంలో రాష్ట్ర ఇంచార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కమిటీ సభ్యుడు బాబా సిద్దిఖీ, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరి, విశ్వనాథ్, మన్సూర్ అలీఖాన్ పాల్గొన్నారు. ప్రదేశ్ ఎన్నికల కమిటీ వడపోసి ప్రాథమికంగా ఖరారు చేసిన అభ్యర్థులను స్క్రీనింగ్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించింది. 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను ఖరారు చేసిన అభ్యర్థుల విషయమై రాష్ట్ర నాయకులు, కమిటీ సభ్యులతో అధ్యక్షుడు చర్చించారు.
ఉదయం నుంచి సుదీర్ఘంగా సమాలోచనలు చేసినా.. కేవలం 35 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల విషయంలో మాత్రమే ఒక కొలిక్కి రాగలిగారు. ఇందులో అత్యధిక నియోజకవర్గాలకు పీఈసీ ఒక్కొక్కరి పేరునే ప్రతిపాదించడం గమనార్హం. ప్రస్తుతానికి 35 నియోజకవర్గాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవని స్క్రీనింగ్ కమిటీ గుర్తించింది. ఇక మిగిలిన వాటిపై మరింత లోతుగా చర్చించాల్సి ఉన్నదని.. సమయం లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేశామని కాంగ్రెస్ ప్రకటించింది.
రాష్ట్రంలోని అత్యధిక నియోజకవర్గాల్లో బీసీ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలనే డిమాండ్, ముస్లిం నాయకులకు కూడా ఈ సారి ఎక్కువ టికెట్లు ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినందుకు స్క్రీనింగ్ కమిటీ సభ్యులు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో బలంగా ఉన్న ఇద్దరు ముగ్గురు నాయకుల గురించి పూర్తిగా ఆరా తీస్తున్నారు. కేవలం అంగ, అర్థ బలం ఉంటే సరిపోదని.. క్షేత్రస్థాయిలో వారికి ఎంతటి గుర్తింపు ఉన్నది.. ప్రజలకు వారి పట్ల ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయనే విషయాలను కూడా పరిశీలించినట్లు సమాచారం.
ఇక కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇస్తే నష్టం జరగుతుందని పలు జిల్లాల అధ్యక్షులు స్క్రీనింగ్ కమిటీకి చెప్పారు. ఈ విషయంపై సమావేశంలో తీవ్రమైన చర్చ జరిగినట్లు తెలుస్తున్నది. కొత్తగా వచ్చే వారికి టికెట్లు ఇస్తామనే హామీతోనే చేరారని.. ఇప్పుడు ఇవ్వకపోతే అసలుకే ఎసరు తగులుతుందనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. దీంతో 35 నియోజకవర్గాలు మినహా.. మిగిలిన చోట ముగ్గురి చొప్పున అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ జాబితాపై మరోసారి సమావేశం అవుతారని.. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల కమిటీకి పంపిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పార్లమెంటు ప్రత్యేక సమవేశాలు ఈ నెల 22న ఉన్నందున.. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ ఉంటుందని.. అక్కడ 35 నియోజకవర్గాల అభ్యర్థుల విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తున్నది. నెలాఖరులోగా కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.