Telugu Global
Telangana

కేసీఆర్‌ దీక్షతో విధిలేని పరిస్థితుల్లోనే కాంగ్రెస్‌ తెలంగాణ ఇచ్చింది

ఆ పార్టీ కర్కశత్వంతోనే యువత బలిదానాలు చేసుకున్నరు : బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

కేసీఆర్‌ దీక్షతో విధిలేని పరిస్థితుల్లోనే కాంగ్రెస్‌ తెలంగాణ ఇచ్చింది
X

కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్షతోనే అప్పటి కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం విధిలేని పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. దీక్షా దివస్‌ సందర్భంగా కరీంనగర్ సమీపంలోని అల్గునూరు చౌరస్తాలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ ఒక్కో మాట తూటాలా పేలిందన్నారు. తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్‌ మాట తప్పి కర్కశంగా వ్యవహరించిందని, అందుకే యువత ఆత్మబలిదానాలు చేశారన్నారు. తెలంగాణ ఇవ్వకుంటే వీపు చింతపండు అయితదనే పరిస్థితిని కేసీఆర్‌ కల్పించారని అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి పురిటినిచ్చిన గడ్డ కరీంనగర్‌ అని, ఇక్కడ జరిగిన సింహగర్జనతోనే కేసీఆర్‌ దేశానికి పరిమితమయ్యారని తెలిపారు. 2009లో బీఆర్‌ఎస్‌ ఓడిపోయినప్పుడు చాలా మంది అవమానకరంగా మాట్లాడారని, తెలంగాణవాదం లేదన్నారని.. ఇదే కరీంనగర్‌ గడ్డపై నుంచి కేసీఆర్‌.. తన శవయాత్రనో.. తెలంగాణ జైత్రయాత్రనో అని గర్జించారని అన్నారు. కరీంనగర్‌ ప్రజల పోరాట స్ఫూర్తి లేకుండా తెలంగాణ సిద్ధించేదో లేదో తెలియదన్నారు. కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ఈరోజుకు 15 ఏళ్లు గడిచాయన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు నుంచే తెలంగాణకు కాంగ్రెస్‌ అన్యాయం చేసిందన్నారు. 1969 ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచి వేసిందని, 371 మందిని కాల్చిచంపారని అన్నారు. అయినా ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌, మేధావులు, కవులు, కళాకారులు తెలంగాణ సాధన కోసం ఉద్యమించారని తెలిపారు. తెలంగాణ ఉద్యమం నుంచి తప్పుకుంటే రాళ్లతో కొట్టి చంపాలని కేసీఆర్‌ ఉద్యమంలోకి వచ్చారని గుర్తు చేశారు. ఈరోజు కొందరు కేసీఆర్‌ ను తక్కువ చేసి మాట్లాడుతున్నారని.. కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పెట్టినప్పుడు ఆయనకు 46 ఏళ్లు మాత్రమేనని తెలిపారు. కేసీఆర్‌కు పదవుల మీద మోజు ఉంటే మంత్రి పదవి తీసుకొని హాయిగా ఉండొచ్చన్నారు. తెలంగాణ నాయకులు పదవుల కోసం ఉద్యమాన్ని తాకట్టు పెట్టారనే అపవాదు రావొద్దనే ఆయన పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలోకి వచ్చారన్నారు. 14 ఏళ్ల పోరాటంలో అనేక అపజయాలు, ఎదురుదెబ్బలు, విజయాలు ఉన్నాయన్నారు. కేసీఆర్‌ అంటే ఒక పేరు కాదు పోరు అన్నారు. తెలంగాణ ఉద్యమకారులపైకి తుపాకీ ఎక్కుపెట్టినోడు ఈరోజు ఏదేదో మాట్లాడుతున్నాడని అన్నారు. తెలంగాణ చరిత్రలో కేసీఆర్ హిమాలయమైతే రేవంత్‌ ఆయన కాలిగోటికి కూడా సరిపోడన్నారు.

ఎన్నో అబద్దపు హామీలు, ఆరు గ్యారంటీలు, నంగనాచి మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. రాష్ట్రంలో ఎవరిని కాంగ్రెస్‌ పాలన గురించి అడిగినా సరే బోరున ఏడుస్తున్నారని తెలిపారు. ఫుడ్‌ పాయిజన్‌తో గురుకులాల్లో పిల్లలు చనిపోతున్నారని, ఈమాత్రం పాలనకు విజయోత్సవాలు చేస్తున్నారు.. పోలీసులు లేకుండా ప్రజల్లోకి పోతే వీళ్లను ఉరికించి కొట్టేటోళ్లు అన్నారు. 2001లో కేసీఆర్‌ ఉద్యమం మొదలు పెట్టిన నాడు పిడికెడు మంది మాత్రమే వెంట ఉన్నారని తెలిపారు. 2009లో ఆమరణ దీక్ష చేసేందుకు వెళ్తున్న కేసీఆర్‌ ను ఇదే అల్గనూరు చౌరస్తాలో అరెస్ట్ చేశారని, ఆ రోజు తమను తప్పించి వందలాది పోలీసులు మొహరించి ఖమ్మం జైలుకు తీసుకెళ్లారని గుర్తు చేశారు. కేసీఆర్‌ ను అరెస్ట్‌ చేశారని శ్రీకాంతాచారి ఆత్మబలిదానం చేశాడని, ఆ తర్వాతి రోజే కానిస్టేబుల్‌ కిష్టయ్య ఆత్మహుతి చేసుకున్నాడని అన్నారు. కేసీఆర్‌ ఆమరణ దీక్షతో ఉద్యమం పతాక సన్నివేశానికి చేరిందన్నారు. కేసీఆర్‌ ఉద్యమ చరిత్ర ఈ రోజు 18, 20 ఏళ్ల వయసున్న పిల్లలకు తెలియదని, కేసీఆర్‌ సీఎంగా ఆయన చేసిన పనులు మాత్రమే తెలుసన్నారు. కేసీఆర్‌ ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చిండని వాళ్లకు తెలియజెప్పాలన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ప్రకటన నుంచి వెనక్కి తగ్గిన తర్వాత మరో పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. కేసీఆర్‌ దీక్షా స్ఫూర్తిని సంకల్పంగా తీసుకొని కాంగ్రెస్‌ పై పోరాటం చేయాల్సి ఉందన్నారు. రానున్న నాలుగేళ్లు ప్రజల మధ్యే ఉంటూ పోరాడుదామని పిలుపునిచ్చారు.

First Published:  29 Nov 2024 10:02 AM
Next Story