Telugu Global
Telangana

సెప్టెంబ‌ర్‌ 17 ను బీజేపీ తెలంగాణ విచ్ఛిన్న‌ దినం చేయబోతుందా ?

సెప్టెంబ‌ర్‌ 17 న హైదరాబాద్ లో తెలంగాణ విమోచన దినం అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణలో మత చిచ్చు రగల్చడానికి, తెలంగాణను అవమానించడానికే అనే ఆరోపణలు వస్తున్నాయి.

సెప్టెంబ‌ర్‌ 17 ను బీజేపీ తెలంగాణ విచ్ఛిన్న‌ దినం చేయబోతుందా ?
X

తెలంగాణలో అధికారంలోకి రావడానికి పడరాని పాట్లు పడుతున్న బీజేపీ రోజుకో కొత్త ఎత్తుగడ వేస్తోంది. ఒక వైపు మునుగోడు ఎన్నికల రాజకీయం, మరో వైపు రాష్ట్రాన్ని నాలుగు రీజియన్లుగా విభజించి కేంద్రమంత్రులను ఇంచార్జీలుగా వేయడం, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సహా బీజేపీ అగ్రనేతలంతా తెలంగాణ పర్యటన‌లు చేయడం, బీజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాద యాత్ర, బహిరంగ సభలు, సినీ నటులతో కేంద్ర నాయకుల సమావేశాలు..... ఈ అన్ని సందర్భాల్లో మత విద్వేషాలను రెచ్చగొడుతూ ఉపన్యాసాలు, తెలంగాణ పోరాటాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు, ఒక మతాన్ని టార్గెట్ చేసుకొని దాడి, మతం ఆధారంగా ఓట్ల పోలరైజేషన్ కోసం విఫల యత్నాలు.....

అభివృద్ది, రైతుల సమస్యలు, ఉద్యోగాలు, అధికరేట్లు, తెలంగాణకు కేంద్రం చేస్తున్న అన్యాయం, చూపిస్తున్న వివక్ష వీటిపై ప్రజలనుండి వచ్చే ప్రశ్నలను ఎదుర్కోలేక దృష్టి మళ్ళించే కార్యక్రమాలను తీవ్రతరం చేసింది బీజేపీ. అందులో భాగంగానే ఇప్పుడో కొత్త వ్యూహం పన్నింది. సెప్టెంబ‌ర్‌ 17న తెలంగాణ విమోచనా దినోత్సవాన్ని హైదరాబాద్ లో అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తన రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ వేసిన సంకుచితమైన ఎత్తుగడ ఇది.

ఈ దినం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగసభ నిర్వహిస్తారట. దానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కర్నాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు, పలువురు కేంద్ర మంత్రులు హాజరవుతారట. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్ళైంది. ఈ ఎనిమిదేళ్ళలో ఎన్నడూ గుర్తురాని తెలంగాణ విమోచన దినం ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది? ఎందుకంటే త్వరలోనే మునుగోడు ఉప ఎన్నిక ఉంది. ఆ తర్వాత కొద్ది కాలానికే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఆ లోపు తెలంగాణ ప్రజలను మతం ఆధారంగా పోలరైజ్ చేయాలి. అదీ దీని వెనకాల ఉన్న అసలు కుట్ర.

నిజాంకు వ్యతిరేకంగా బీజేపీ ప్రచారం చేయడాన్ని అర్దం చేసుకోవచ్చు. కానీ నిజాం పేరుతో ఎమ్ ఐ ఎమ్ ను, ఆ పార్టీ పేరుతో టీఆరెస్ ను టార్గెట్ చేయడమే ప్రస్తుతం ఆ పార్టీ అసలు లక్ష్యం.

నిజానికి సెప్టెంబ‌ర్‌ 17 తెలంగాణ విమోచ‌న దినమనే వాదనే వివాదాస్పద‌మైనది. అది విద్రోహ దినమని కొందరు, అది విలీన దినమని మరికొందరు...ఇలా అనేక వాదనల నేపథ్యంలో సెప్టెంబ‌ర్‌ 17 ను విమోచన దినంగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం తెలంగాణ ప్రజలను అవమానించడానికి కాదా ? ఒక వేళ ఆ దినం గురించి మాట్లాడాలంటే. 1947 లో నెహ్రూ ప్రభుత్వానికి నిజాం ప్రభుత్వానికి జరిగిన ఒప్పందం గురించి మాట్లాడాలి. నిజాం భారత ప్రభుత్వానికి లొంగిపోయాక నిజాంకు ఇచ్చిన రాజ్ ప్రముఖ్ (గవర్నర్)పదవి గురించి మాట్లాడుకోవాలి. 1948 సెప్టెంబర్ 17 తర్వాత కూడా హైదరాబాద్ రాజ్య పాలన 1950 జనవరి 26 దాకా మీర్ ఉస్మాన్ అలీఖాన్ పేరు మీదనే సాగిందనే విషయం గురించి మాట్లాడుకోవాలి. ఆతర్వాత కూడ 1956 నవంబర్ 1 దాకా ఆయన రాజప్రముఖ్ గా కొనసాగిన విషయం గురించి మాట్లాడుకోవాలి.నిజాం నాయకత్వంలో గ్రామాల్లో అరాచకాలు సృష్టించిన అనేక మంది దొరల గురించి మాట్లాడుకోవాలి. ఆ తర్వాత వాళ్ళ అరాచకాలు, దోపిడి కొనసాగిన విధం గురించి మాట్లాడుకోవాలి. హైదరాబాద్ రాష్ట్రంలో అడుగుబెట్టిన పటేల్ సైన్యం దాదాపు సంవత్సర కాలం సాగించిన మారణ కాండపై సరోజినీ నాయుడు కుమారుడు జయసూర్య ఇచ్చిన నిజనిర్దారణ రిపోర్ట్ గురించి మాట్లాడుకోవాలి. ఇవన్నీ వదిలేసి నిజాం పాలన అంటే 6 నెలలకన్నా ఎక్కువ కాలం లేని రజాకార్లు మాత్రమే అని బీజేపీ చేస్తున్న ప్రచారం వెనక ఉన్న కుట్రను అర్దం చేసుకోవాలి.

తమ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ తీరుపై, ఓట్ల కోసం ఎంతకైనా తెగించే ఆ పార్టీ వ్యవహారంపై ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. సెప్టెంబ‌ర్‌ 17 విమోచన దినమా, విద్రోహ దినమా, విలీన దినమా.... ఏదైనా కావచ్చు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. కానీ ఆ దినం తెలంగాణ విచ్చిన్నదినం మాత్రం కాకూడదు. అలా కానీయకుండా కాపాడుకోవడం గురించి ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి

First Published:  2 Sept 2022 8:55 PM IST
Next Story