నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదిపై కేంద్రం కుట్రలు
ఈ నెల 22న సమావేశానికి హజరుకావాలని సీఎం రేవంత్ రెడ్డికి తమిళనాడు సీఎం ఆహ్వానం

నియోజకవర్గాల పునర్విభజనతో వాటిల్లే నష్టాలపై చర్చించడానికి ఉద్దేశించిన సమావేశానికి రావాలని సీఎం రేవంత్ రెడ్డిని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆహ్వానించారు. ఈ మేరకు ఢిల్లీలో సీఎం రేవంత్ ను తమిళనాడు మంత్రి టీకే నెహ్రూ,డీఎంకే ఎంపీ కణిమెళి సహా పలువురు నేతల సహా ఆ పార్టీ ఎంపీలు కలిశారు. ఈ నెల 22న స్టాలిన్ ఏర్పాటు చేసిన సమావేశానికి హజరుకావాలని కోరారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. బీజేపీ పునర్విభజన పేరుతో దక్షిణాది రాష్ట్రాలపై పన్నుతున్న కుట్రలను తిప్పికొట్టడానికే ఈ నెల 22న చెన్నైలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దేశస్థాయిలో పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనపై ఆ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నష్టంపై చర్చించనున్నాం. భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించడానికి వారు ఆహ్వానం పలికారు. మా పార్టీ అధిష్ఠానంతో మాట్లాడి ఈ సమావేశానికి హాజరై కేంద్రం కుట్రలను ఛేదించడానికి కార్యాచరణ చేపడుతామన్నారు. పునర్విభజన పేరుతో కేంద్రం కుట్రలు పన్నుతున్నదని సీఎం ఆరోపించారు. డీలిమిటేషన్ అనేది సౌత్‌కు లిమిటేషన్ అన్నారు.దీన్ని మేము అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. ఉత్తరాది కంటే దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నది. దేశానికి ఈ రాష్ట్రాలు ఉత్తరాదికంటే ఎక్కువగా అందిస్తున్నది. కానీ బీజేపీ దక్షిణాది రాష్ట్రాల సీట్లు పెరగకుండా చూసే ప్రయత్నం చేస్తున్నది. దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఏపీలో ఆ పార్టీకి పెద్దగా బలం లేదు, వీటితో పాటు కర్ణాటక కూడా బీజేపీ బలపడటాన్ని ఎన్నడూ అంగీకరించవు. అందుకే దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం కుట్రలు చేస్తుందన్నారు.