కేంద్రం నిర్లక్ష్యం.. ఆలస్యం అవుతున్న యాదాద్రి పవర్ ప్లాంట్ పనులు!
వైటీపీపీలో భాగమైన రెండు యూనిట్లు (ఒక్కోటి 800 మెగావాట్లు) ఈ ఏడాది డిసెంబర్ లోగా అందుబాటులోకి రావల్సి ఉన్నది.
తెలంగాణ విషయంలో కేంద్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీఎం కేసీఆర్ పలుమార్లు వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వడంలో, ప్రాజెక్టులు మంజూరు చేయడంతో మొండి చెయ్యి చూపడమే కాకుండా.. సొంతంగా కట్టుకునే ప్రాజెక్టులకు కూడా అడ్డుపడుతోందని పలు మార్లు ఆరోపించారు. తాజాగా నల్గొండ జిల్లా దామరచర్ల వద్ద నిర్మిస్తున్న 4వేల మెగావాట్ల యాదాద్రి థర్మప్ పవర్ ప్లాంట్ (వైటీపీపీ) విషయంలో కూడా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
వైటీపీపీలో భాగమైన రెండు యూనిట్లు (ఒక్కోటి 800 మెగావాట్లు) ఈ ఏడాది డిసెంబర్ లోగా అందుబాటులోకి రావల్సి ఉన్నది. ఈ విద్యుత్ అందుబాటులోకి వస్తే వచ్చే ఏడాది రబీ సీజన్‌కు పంటలకు పుష్కలంగా విద్యుత్ లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. అయితే గతంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ అనుమతులపై సస్పెన్షన్ విధించింది. ఈ సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ఎన్నిసార్లు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖను ఎన్ని సార్లు కోరినా స్పందించడం లేదు.
పర్యావరణ అనుమతులపై ఉన్న సస్పెన్షన్ ఎత్తి వేస్తేనే థర్మల్ పవర్ ప్లాంట్‌లో అవసరమైన మెషినరీని ఏర్పాటు చేయడానికి వీలుంటుంది. గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సౌత్ జోన్ పవర్ ప్లాంట్ పనులను నిర్వహించుకోవచ్చని ఆదేశాలు ఇచ్చింది. దీంతో మెషినరీ ఏర్పాటు చేసి ట్రయల్ రన్‌కు వెళ్లాలని అధికారులు భావిస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అటవీ శాఖ పర్యావరణ అనుమతులపై సస్పెన్షన్ ఎత్తివేయక పోవడంతో పనులు ముందుకు సాగడం లేదు.
పర్యావరణ ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ విశాఖపట్నానికి చెందిన సమత, ముంబైకి చెందిన కన్జర్వేషన్ యాక్షన్ ట్రస్ట్ అనే ఎన్జీవోలు ఫిర్యాదు చేశాయి. వైటీపీపీకి ఇచ్చిన పర్యావరణ అనుమతులు సస్పెండ్ చేయాలని కోరడంతో.. ఆ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కాగా, తెలంగాణ జెన్‌కో ఇప్పటికే పర్యావరణానికి సంబంధించి పూర్తి వివరాలను అందించింది. కేంద్రం వివరణ ఇవ్వడానికి తొమ్మిది నెలల సమయం ఇచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆరు నెలల్లోనే సమాధానం ఇచ్చింది. అయినా సరే అటు వైపు నుంచి ఇంత వరకు స్పందన రాలేదని చెప్పింది.
వైటీపీపీకి 10 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి వణ్యప్రాణి సంరక్షణ కేంద్రాలు లేవని జెన్‌కో వివరణలో పేర్కొన్నది. అలాగే పవర్ ప్లాంట్ నిర్మాణం వల్ల వణ్య ప్రాణులపై ఎలాంటి ప్రభావం పడదని చెప్పింది. అంతే కాకుండా ఆ పరిసర ప్రాంతాల్లో గాలి నాణ్యత కూడా ఎంత మాత్రం తగ్గదని స్పష్టం చేసింది. దేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న తొలి సూపర్ క్రిటికల్ అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు కావడంతో అక్కడ ఉపయోగించే బొగ్గు నాణ్యత, గాలిలోకి వదిలే సల్ఫర్‌పై కూడా వివరణ కోరింది.
వైటీపీపీలో 100 శాతం సింగరేణి బొగ్గునే ఉపయోగించనున్నట్లు తెలిపింది. దిగుమతి చేసుకున్న బొగ్గు, ఇతర ప్రాంతాల్లోని బొగ్గు కంటే సింగరేణి బొగ్గు చాలా నాణ్యత ఉంటుందని.. ఈ బొగ్గు నుంచి చాలా తక్కువ మోతాదులోనే సల్ఫర్ విడుదల అవుతుందని పేర్కొన్నది. సింగరేణి బొగ్గు నుంచి విడుదలయ్యే సల్ఫర్‌ను పట్టించుకోవల్సిన అవసరమే లేదని చెప్పింది. అయినా సరే పవర్ ప్లాంట్‌లో ఫ్లూగ్యాస్ డీ-సల్ఫరైజేషన్ చాంబర్లను నియమిస్తున్నామని.. ఇది సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్‌ను తటస్థీకరిస్తాయని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వానికి పూర్తి నివేదిక అందించిన తర్వాత కూడా ఎలాంటి స్పందన రాలేదని.. దీంతో పనులు పూర్తిగా ఆపేయాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. వైటీపీపీ పర్యావరణ అనుమతులపై ఎన్జీటీలో ఫిర్యాదు చేసిన రెండు ఎన్జీవోలపై కూడా అనుమానాలు ఉన్నాయని అన్నారు. సదరు ఎన్జీవోలు కావాలనే కేసులు వేశాయని.. వైటీపీపీ పనులను ఆపేయడమే వాటి అంతిమ లక్ష్యమని ఒక అధికారి చెప్పారు. ఇటీవల ఆ రెండు ఎన్జీవోలపై సీబీఐ కేసు కూడా నమోదైందని.. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద ఆ ఎన్జీవోలపై పలు కేసులు ఉన్నట్లు తెలిసింది.