కేంద్రం తెలంగాణను శతృదేశంలా చూస్తోంది -కేటీఆర్
''దురదృష్టవశాత్తు కేంద్రం తెలంగాణపై ప్రతీకార ధోరణితో వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని శత్రుదేశంలా చూస్తోంది. అశాంతి సృష్టించేందుకు శత్రు దేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించినట్టు గానే ఎంజీఎన్‌ఆర్‌ఈజీ కింద తెలంగాణకు చెల్లించాల్సిన రూ.1,200 కోట్ల రూపాయల వాటాను కేంద్రం ఉద్దేశపూర్వకంగా చెల్లించడం లేదు.'' అని కేటీఆర్ అన్నారు.
బిజెపి నేతృత్వంలోని కేంద్రం తెలంగాణను శతృదేశంలా చూస్తున్నదని, శత్రు దేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించినట్టుగానే తెలంగాణ పట్ల వ్యవహరిస్తోందని, ప్రతీకార ధోరణితో వ్యవహరిస్తోందని,మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ మండి పడ్డారు.
సోమవారం సిరిసిల్లాలో జరిగిన జాతీయ పంచాయతీ అవార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, 1,200 కోట్ల రూపాయల MGNREGS బకాయిలను కేంద్రం ఇంకా చెల్లించలేదని అన్నారు.
అందుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీలకు బకాయిలనుమొత్తం క్లియర్ చేస్తున్నదని కేటీఆర్ చెప్పారు. పల్లె ప్రగతి, నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర గ్రాంట్‌లకు సంబంధించిన బకాయిలను క్లియర్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులోగా రూ.1,300 కోట్లు విడుదల చేస్తుందని ఆయన చెప్పారు.
గ్రామీణ సాధికారతలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం సహకరించి ఉంటే రెట్టింపు ఉత్సాహంతో పని చేసే అవకాశం ఉండేదన్నారు.
''దురదృష్టవశాత్తు కేంద్రం తెలంగాణపై ప్రతీకార ధోరణితో వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని శత్రుదేశంలా చూస్తోంది. అశాంతి సృష్టించేందుకు శత్రు దేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించినట్టు గానే ఎంజీఎన్‌ఆర్‌ఈజీ కింద తెలంగాణకు చెల్లించాల్సిన రూ.1,200 కోట్ల రూపాయల వాటాను కేంద్రం ఉద్దేశపూర్వకంగా చెల్లించడం లేదు.'' అని కేటీఆర్ అన్నారు.
''తెలంగాణపై కేంద్రం చూపుతున్న వివక్ష, రాజకీయ కక్ష సాధింపుపై గ్రామాల్లో చర్చించాలని సర్పంచ్‌లను, ఇతర ప్రజాప్రతినిధులను కోరుతున్నాను'' అని కేటీఆర్ అన్నారు.
ఈ ఆరోపణలపై ప్రజలకు ఏవైనా అనుమానాలు ఉంటే, అన్ని వివరాల కోసం సమాచార హక్కు కింద సమాచారం తెలుసుకోవచ్చని ఆయన చెప్పారు.
''పూర్వ ఆంధ్రప్రదేశ్‌లో గంగదేవిపల్లి, అంకాపూర్‌లను ఆదర్శ గ్రామాలుగా గుర్తించారు. ఇప్పుడు బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మొత్తం 12,769 గ్రామ పంచాయతీలు పారిశుధ్యం, పచ్చదనం, గ్రామీణాభివృద్ధి, సౌకర్యాల కల్పనలో ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి.'' అని కేటీఆర్ పేర్కొన్నారు.
''గ్రామపంచాయతీల్లో ఉత్తమ విధానాలను అధ్యయనం చేసేందుకు 2014లో తెలంగాణకు చెందిన ఒక బృందం కేరళను సందర్శించింది. ఇప్పుడు, 11 నుండి 12 రాష్ట్రాల బృందాలు ఉత్తమ విధానాలను అధ్యయనం చేయడానికి తెలంగాణను సందర్శించాయి.'' అని తెలిపారు కేటీఆర్.