రేవంత్ పాలనలో బతుకమ్మ పండుగ కళ తప్పింది
పండుగ ఏర్పాట్లు చూడబోయిన ఎమ్మార్వోను హైడ్రా భయంతో తరిమికొట్టిండ్రట : కేటీఆర్
రేవంత్ రెడ్డి పాలనలో బతుకమ్మ పండుగ కళ తప్పిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వరంగల్ లోని బతుకమ్మ ఘాట్ లో పండుగ ఏర్పాట్లు పర్యవేక్షించడానికి ఎమ్మార్వో వెళ్తే ఇండ్లు కూలగొట్టేందుకు వచ్చారని ప్రజలు తరిమికొట్టారని.. రాష్ట్రంలో పరిస్థితి అంత అధ్వనంగా ఉందని తెలిపారు. తెలంగాణ భవన్ లో బుధవారం కాంగ్రెస్ సీనియర్ నేత అలావుద్దీన్ పటేల్ తన అనుచరులతో కలిసి బీఆర్‌ఎస్ లో చేరారు. కేటీఆర్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇప్పటికే ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు, రైతులకు రైతుబంధు ఇచ్చేవారని.. ఈసారి పండుగ పండుగ లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో పండుగ జరుపుకోలేని భయానక వాతావరణం సృష్టించారని అన్నారు. యూపీలో అక్కడి సీఎం బుల్డోజర్ రాజ్ నడిపిస్తున్నారని అనుకున్నామని, తెలంగాణలో అలాంటి బుల్డోజర్ సంస్కృతి తీసుకువచ్చారని అన్నారు. ప్రభుత్వ అఘాయిత్యాలను చూసి ప్రతి ఒక్కరు కేసీఆర్ ను తలచుకుంటున్నారని అన్నారు. అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. పది నెలల్లోనే అన్నివర్గాలు అసంతృప్తితో ఉన్నాయన్నారు. డిసెంబర్ 9న సోనియగాంధీ బర్త్ డే సందర్భంగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని.. ఇప్పటి వరకు రుణమాఫీ చేయలేదన్నారు. కేసీఆర్ జాబ్ పోగొడితే.. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలిస్తామని అశోక్ నగర్ కు వచ్చి రాహుల్ గాంధీ స్వయంగా హామీ ఇచ్చారని.. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి ఉద్యోగాలు వచ్చాయి తప్ప రాష్ట్రంలోని యువతకు మాత్రం ఉద్యోగాలు రాలేదన్నారు.
అధికారం కోసం కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చిందని.. వాటిని అమలు చేయకపోగా కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలను కూడా నిలిపి వేశారన్నారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున సాయం చేస్తామని చెప్పారని, పింఛన్లు రెట్టింపు చేస్తామని, రైతుబంధు పెంచుతామని హామీలు ఇచ్చారని, ఏ ఒక్కటీ అమలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఏమయ్యాయో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ''కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అన్నడు.. తులం ఇనుము కూడా ఇవ్వడువా డో లంగ..'' అని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే పైసలు లేవని అంటున్నారని.. మూసీ ప్రాజెక్టుకు మాత్రం రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తారట అని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టులో రూ.లక్ష కోట్లు మింగి రాహుల్ గాంధీ, వాళ్ల బావ వాద్రాకు కోట్లు దోచిపెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు గల్లా పట్టి అడిగే వరకు కాంగ్రెస్ పార్టీ మెసం చేస్తూనే ఉంటుందన్నారు. వీళ్లకు ఓట్లేసి గెలిపిస్తే.. సమస్య వస్తే కలెక్టర్లకు చెప్పుకోమంటున్నారని, ప్రజలకు ఇదేం ఖర్మ అని ప్రశ్నించారు. గ్యారంటీల పేరుతో మోసం చేయాలని చూస్తే హర్యానా ప్రజలు సరైన బుద్ధి చెప్పారన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ బుద్ధి తెచ్చుకోవాలన్నారు.
రాష్ట్రంలోని పేదలకు కేసీఆర్ అవసరమైన అన్ని సేవలు అందించారని, అందుకే ప్రజలంతా కేసీఆర్ సీఎంగా లేరని బాధ పడుతున్నారని తెలిపారు. కేసీఆర్, బీఆర్‌ఎస్ ఉన్నంత వరకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. మనిషిని మనిషిగా చూసే రాజకీయాలు మాత్రమే చేస్తామన్నారు. తమను బెదిరించేందుకు ప్రధాని మోదీ ప్రయత్నించారని, తలవంచలేదని తమ చెల్లిని జైళ్లో పెట్టారని అన్నారు. అయినా మోదీతో పోరాడమే తప్ప తలొగ్గలేదన్నారు. అదే పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తామన్నారు. పేదలకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పై పోరాడుతూనే ఉంటామన్నారు. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ లో రైతుల భూములు అక్రమంగా గుంజుకుంటున్నారని, దానికి వ్యతిరేకంగా తమ పార్టీ నేత పట్నం మహేందర్ రెడ్డి పాదయాత్ర చేస్తుంటే అక్రమంగా అరెస్ట్ చేశారని, రైతులపై లాఠీచార్జీ చేశారని అన్నారు. సొంత నియోజకవర్గ ప్రజలనే ఒప్పించలేని రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ఎలా నడిపిస్తారని నిలదీశారు. ప్రజల భయాందోళనలు నివృత్తి చేసి భూములు ఇచ్చేలా వారిని ఒప్పించాలన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని ఎన్నో రోజులు అరాచకాలు సాగించలేరన్నారు. నరేందర్ రెడ్డి సహా బీఆర్‌ఎస్ నేతలు, రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.