తెలంగాణలోనే అతిపెద్ద ఆస్పత్రి త్వరలో ప్రారంభం... బీజేపీ ట్రోలర్ ల కు కేటీఆర్ పంచ్
తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వరంగల్ నగరంలో వేగంగా నిర్మాణం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పనులు శరవేగంగా నిర్వహిస్తోంది.
ఉత్తర తెలంగాణలోని ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు.
వరంగల్ లో హెల్త్ సిటీ ప్రాజెక్టులో భాగంగా రూ.1200 కోట్లతో ఈ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నారు. పాత సెంట్రల్ జైలు ఆవరణలో 56 ఎకరాల క్యాంపస్‌లో 24 అంతస్తులతో ఈ బిల్డింగ్ ను నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫైర్ సేఫ్టీ, జైళ్ల శాఖలు ఈ ప్రాజెక్టుకు అనుమతులు జారీ చేశాయి. 24 అంతస్తులలో, 16 అంతస్తులు ఆసుపత్రి సేవలకు ఉపయోగిస్తారు. మిగిలినవి అకడమిక్, ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.
వైద్యారోగ్య శాఖ మంత్రి టీ హరీశ్‌రావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి వీ ప్రశాంత్‌రెడ్డి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నిర్మాణ పనులకు అనుగుణంగా వైద్యులు,ఇతర వైద్య సిబ్బందిని కూడా నియమించడానికి ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ జూన్ 21, 2021న ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు.
పురోగతిలో ఉన్న ఈ ఆస్పత్రి నిర్మాణ పనుల చిత్రాలను ట్విట్టర్ లో షేర్ చేసిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ , 2,000 పడకలతో తెలంగాణలోనే అతిపెద్ద ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఆతిథ్యం ఇవ్వడానికి వరంగల్ నగరం సిద్ధమవుతోంది. అని కామెంట్ చేశారు.
24 అంతస్తుల ఈ ఆసుపత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక అని, దీని నిర్మాణం శరవేగంగా జరుగుతోందని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.
మొత్తం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుందని, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం లేదని మంత్రి చెప్పారు.
"కొంతమంది బిజెపి ట్రోల్‌లు వెర్రి వాదనలు చేయడం ప్రారంభించే ముందు, ఈ ఆసుపత్రికి భారత ప్రభుత్వ సహకారం శూన్యం అని తెలుసుకుంటే మంచిది" అనికేటీఆర్ అన్నారు.
Before some Dumb BJP trolls start making silly claims, let me assure you that the contribution of Govt of India to this hospital is ZERO https://t.co/Cd1sJ1IiOD
— KTR (@KTRTRS) January 8, 2023