10 కోట్ల మంది ఆకలి తీర్చిన ప్రభుత్వం
హైదరాబాద్ నగరంలో పేదల ఆకలి తీర్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో అన్నపూర్ణ పథకాన్ని ప్రారంభించింది. 5 రూపాయలకే కమ్మని భోజనం అందిస్తోంది. ఇప్పటివరకు ఈ పథకం కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.185.89 కోట్లు ఖర్చు చేసింది.

హైదరాబాద్ పరిధిలో 5 రూపాయలకే భోజనం అందిస్తూ తెలంగాణ ప్రభుత్వం 2014లో మొదలు పెట్టిన అన్నపూర్ణ పథకం ఇప్పటి వరకూ 9.67 కోట్ల మంది నిరుపేదల ఆకలి తీర్చింది. ఈ పథకం కోసం ప్రభుత్వం 185.89 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. హైదరాబాద్ లో నివశించే నిరుపేదల కోసం మొదలు పెట్టిన ఈ పథకం.. ఎంతోమంది అభాగ్యులకు అండగా నిలిచింది, చిరుద్యోగుల కడుపు నింపింది, విద్యార్థుల ఆకలి తీర్చింది, కరోనా కష్టాల్లోనూ ఆదుకుంది.
హైదరాబాద్ ఓవైపు అందంగా సింగారించుకున్న విశ్వ నగరం. మరోవైపు ఎన్నో ఆశలతో సిటీకి వచ్చిన పేదలు ఉపాధి కోసం వెదుకులాడుతుంటారు. నగరంలో స్థిరపడటానికి చిరుద్యోగులు కష్టపడుతుంటారు. స్కాలర్ షిప్ తో చదువుకునే విద్యార్థులు ఉద్యోగాల కోసం కుస్తీ పడుతుంటారు. ఇలాంటి వారంతా హోటళ్లకు ఖర్చు పెట్టలేరు, అలాగని కడుపు మాడ్చుకోలేరు. గతంలో పరిస్థితి ఎలా ఉన్నా.. 2014 నుంచి మాత్రం హైదరాబాద్ నగరంలో పేదలు ఆకలితో కడుపు మాడ్చుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. తెలంగాణలో అధికారం చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నపూర్ణ పథకంతో వారి కడుపు నింపింది. 5 రూపాయలకే కమ్మని భోజనం అందించింది.










400 గ్రాముల అన్నం, 120 గ్రాముల సాంబారు,100 గ్రాముల పప్పుతో పాటు 15 గ్రాముల పచ్చడితో కూడిన నాణ్యమైన పోషక విలువలున్న భోజనాన్ని అన్నపూర్ణ పథకం కింద ప్రభుత్వం అందజేస్తోంది. 2014 లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చొరవతో ఈ పథకం మొదలైంది. జీహెచ్ఎంసీ పర్యవేక్షణలో దీన్ని విజయవంతంగా కొనసాగించారు.
2014లో 150 కేంద్రాల ద్వారా రోజుకు 45 వేల మందికి అన్నపూర్ణ పథకం ద్వారా భోజనాలు అందించేవారు. కొవిడ్ లాక్ డౌన్ సమయంలో నగరంలో 373 కేంద్రాల ద్వారా భోజనం అందించేవారు. వీటిలో కొన్ని మొబైల్ అన్నపూర్ణ క్యాంటీన్లు కూడా ఉన్నాయి. కొవిడ్ సమయంలో పూర్తి ఉచితంగా అన్నపూర్ణ పథకం ద్వారా భోజనాలు అందించారు, నామమాత్రపు రుసుము 5 రూపాయలు కూడా ఎవరి వద్దా తీసుకోలేదు. కొవిడ్ సమయంలో 2020-21 సంవత్సరంలో మొత్తం 2.29 కోట్లమందికి అన్నపూర్ణ పథకం ద్వారా ఆహారాన్ని అందించారు. ఆ తర్వాత సీటింగ్ సదుపాయంతో ప్రజలు కూర్చుని తినే విధంగా అన్నపూర్ణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నగర పరిధిలో 32 కేంద్రాల్లో ఇలా అన్ని వసతులతో కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది మే నెలాఖరు వరకు 9,67,53,612 మందికి అన్నపూర్ణ పథకం ద్వారా భోజనాన్ని అందించామని చెబుతున్నారు అధికారులు. మొత్తం ఈ పథకం కోసం 185.89 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని అంటున్నారు. 2014-15లో 2.21 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా.. 2021-22 నాటికి ఏడాదికి 38 కోట్ల రూపాయలకు పైగా ఈ పథకం కోసం కేటాయించారు. ఏడాదికేడాది ఈ పథకం పరిధిని విస్తరిస్తూ, సౌకర్యాలను పెంచుతూ హైదరాబాద్ లో అన్నార్తుల ఆకలి తీరుస్తోంది తెలంగాణ ప్రభుత్వం.