Telugu Global
Telangana

రిజర్వుడు సీట్లు క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యం.. పార్టీ నాయకులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం

తెలంగాణలో 31 రిజర్వ్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 19 ఎస్సీ, 12 ఎస్టీలకు కేటాయించబడ్డాయి. ప్రస్తుతం 31కి గాను 28 స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు.

రిజర్వుడు సీట్లు క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యం.. పార్టీ నాయకులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం
X

తెలంగాణలో హ్యాట్రిక్ విజయం అందుకోవడానికి బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఒకవైపు దూకుడుగా ఉన్న బీజేపీ, మరో వైపు చాపకింద నీరులా కాంగ్రెస్ పార్టీ తమ బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో ఎక్కడికక్కడ వారిని కట్టడి చేయడానికి.. నియోజకవర్గాల వారీగా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా రిజర్వుడు స్థానాలపై ముందుగా ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేసిన నియోజకవర్గాలను క్లీన్ స్వీప్ చేయాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు, పార్టీ బాధ్యులకు కచ్చితమైన టార్గెట్ నిర్దేశించారు.

తెలంగాణలో 31 రిజర్వ్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 19 ఎస్సీ, 12 ఎస్టీలకు కేటాయించబడ్డాయి. ప్రస్తుతం 31కి గాను 28 స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒక్క సీటు కూడా కోల్పోకుండా క్లీన్ స్వీప్ చేయాలని కేసీఆర్ నిర్దేశించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే దళితులు, గిరిజనుల సంక్షేమం కోసం అనేక‌ పథకాలు అమలు చేస్తోంది. ముఖ్యంగా దళితుల కోసం తీసుకొచ్చిన దళిత బంధు పథకం విజయవంతం అయ్యింది. ఎన్నికల్లోపు మరో దఫా దళిత బంధు కూడా అమలు చేసే అవకాశం ఉన్నది. ఇక గిరిజన/ఆదివాసి బంధు పథకాన్ని కూడా భారీగా అమలు చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తున్నది.

దళితుల కోసం దళిత బంధు మాత్రమే కాకుండా.. టీ-ప్రైడ్ ద్వారా కూడా ఆర్థిక సాయం అందిస్తున్నారు. మరోవైపు ఎస్టీల రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహావిష్కరణ తర్వాత రాష్ట్రంలో దళితులు, గిరిజనులకు సంబంధించిన కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టే అవకాశం ఉన్నది. అంబేద్కర్ జయంతి నాడు హైదరాబాద్‌లో దళితులతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. నియోజకవర్గానికి 300 మంది చొప్పున ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడే దళితుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న, చేయబోయే కార్యక్రమాల గురించి కేసీఆర్ వివరించనున్నారు.

అంబేద్కర్ విగ్రహావిష్కరణ తర్వాత 8,000 మంది దళిత వ్యాపారవేత్తలకు రూ.500 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ చేస్తారు. టీ-ప్రైడ్ ద్వారా కూడా కొత్త యూనిట్లు, చిన్న పరిశ్రమల స్థాపనకు దళితులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. గత 9 ఏళ్లలో దళిత పారిశ్రామిక వేత్తలకు రూ.2,700 కోట్ల మేర పంపిణీ చేశారు. రాబోయే రోజుల్లో మరింత మందికి ఆయా పథకాల ద్వారా లబ్ది చేకూరనున్నది. ఈ వివరాలన్నీ ప్రజలకు తెలియజేయాలని.. ముఖ్యంగా రిజర్వుడు స్థానాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల లబ్దిదారులు.. బీఆర్ఎస్‌కు ఓటేసేలా చూడాలని పార్టీ నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రిజర్వుడు స్థానాలు క్లీన్ స్వీప్ చేస్తే.. రాబోయే ఎన్నికల్లో 100కు పైగా సీట్లు సాధించడం కష్టమేమీ కాదని కేసీఆర్ అంచనా వేస్తున్నారు.

First Published:  13 April 2023 3:41 AM GMT
Next Story