Telugu Global
Telangana

అప్పుడూ వానాకాలంలో కాళేశ్వరం నీళ్లు ఎత్తిపొయ్యలే

రేవంత్‌ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నరు : మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌

అప్పుడూ వానాకాలంలో కాళేశ్వరం నీళ్లు ఎత్తిపొయ్యలే
X

కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడూ వాకానాలం పంట సీజన్‌ లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన బ్యారేజీల నుంచి నీటిని లిఫ్ట్‌ చేయలేదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ తెలిపారు. సోమవారం తెలంగాణ భవన్‌ లో బీఆర్ఎస్‌ నాయకులు గెల్లు శ్రీనివాస్‌, బాలరాజు, కిషోర్‌ కుమార్‌ తో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి పెరగడానికి కాళేశ్వరంతో సంబంధం లేదని సీఎం రేవంత్‌ రెడ్డి అంటున్నారని.. ముఖ్యమంత్రికి ప్రాజెక్టు గురించి అవగాహన లేదని ఎద్దేవా చేశారు. మిడ్‌ మానేరు, ఎల్లంపల్లి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం కాదా అని ప్రశ్నించారు. తట్టెడు మన్ను తీయని రేవంత్‌ ధాన్యం దిగుబడి పెరుగుదలను తన ఖాతాలో వేసుకుంటున్నాడని, పంట విస్తీర్ణం పెరగడంతోనే ధాన్యం దిగుబడి పెరిగిందన్నారు. కేసీఆర్‌ తీసుకున్న రైతాంగ అనుకూల విధానాలతోనే సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. కాళేశ్వరంతో తమకు ఎప్పుడైనా నీళ్లొస్తాయనే ధీమాతోనే రైతులు సాగు పెంచారని తెలిపారు. మూసీకి మల్లన్నసాగర్‌ నుంచి నీళ్లు తెస్తామని చెప్తున్న రేవంత్‌ రెడ్డి.. మల్లన్నసాగర్‌ కు కాళేశ్వరం నుంచే నీళ్లు వస్తాయన్న విషయం గుర్తించాలన్నారు. 1990 నుంచి 2014 వరకు క్రమేణ తగ్గిన సాగు విస్తీర్ణం 2014 తర్వాతే ఎందుకు పెరిగిందో గుర్తించాలన్నారు. కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన రైతుబంధుతోనే రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. యాభై ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణలో వ్యవసాయం వెనుకబడి పోయిందని, కేసీఆర్‌ సీఎం అయ్యాకే రైతులు బాగు పడ్డారని అన్నారు. కూలిపోయిందని ప్రచారం చేసిన మేడిగడ్డ భారీ వరదలను తట్టుకొని నిలబడిందన్నారు. లగచర్లలో గిరిజనులపై దౌర్జన్యాలు జరుగుతుంటే మంత్రి సీతక్క ఎందుకు స్పందించడం లేదని గెల్లు శ్రీనివాస్‌ ప్రశ్నించారు. ప్రజాపాలన కాదు ప్రజావంచన వారోత్సవాలు జరుపుకోవాలన్నారు.

First Published:  18 Nov 2024 3:28 PM IST
Next Story