రాహుల్ గాంధీ అవగాహన లేమికి ఆ ప్రసంగమే నిదర్శనం
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ విమర్శలు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ తెర తీసింది. ములుగు వేదికగా రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతో కాంగ్రెస్ అట్టహాసంగా ప్రచారం ప్రారంభించింది. ఈ సభలో ప్రసంగించిన రాహుల్ గాంధీ బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. గతంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా బీఆర్ఎస్ నెరవేర్చలేదని మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం అంటూ మాయమాటలు చెప్పిందని దుయ్యబట్టారు. భూములు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని అన్నారు. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కూడా విమర్శలు ఎక్కుపెట్టారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ విమర్శలు చేశారు. అయితే ఈ కామెంట్లపై బీఆర్ఎస్ నాయకులు స్పందిస్తూ.. రాహుల్ గాంధీ అవగాహన లేమికి ఈ ప్రసంగమే నిదర్శనం అంటూ ఎద్దేవా చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఖర్చయిన మొత్తమే రూ.80 వేల కోట్ల నుంచి రూ.85 వేల కోట్ల వరకు ఉంటుందని.. అలాంటప్పుడు లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
గతంలో కూడా ఇలాంటి విమర్శలే చేసినప్పుడు రాహుల్ గాంధీకి సమాధానం ఇచ్చామని.. కానీ ములుగు వేదికగా మరోసారి తప్పుడు ఆరోపణలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ అవగాహనా రాహిత్యం మరోసారి బయటపడిందని అంటున్నారు. ఇలాంటి లెక్కల విషయంలో మొదటి సారి పొరపాటు పడితే సరే అనుకోవచ్చు. కానీ పదే పదే తప్పుడు లెక్కలతో విమర్శలు చేయడం తగదని.. దీని వల్ల ఆయనే ప్రజల్లో అభాసుపాలవుతారని అంటున్నారు.
ఇక ములుగు సభలో రాహుల్ మాట్లాడుతూ తెలంగాణ ఇస్తామని 2004లో ఇచ్చిన మాటను కాంగ్రెస్ నిలబెట్టుకుందని అన్నారు. తెలంగాణ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ నష్టపోతుందని తెలిసినా.. సోనియా గాంధీ ప్రజల ఆకాంక్షల కోసం రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. ప్రపంచంలో ఏ పార్టీ చేయని సాహసం కాంగ్రెస్ చేసిందని చెప్పుకొచ్చారు.