Telugu Global
Telangana

అది మా తెలంగాణ పథకం.. మోడీ కాపీ కొట్టారు : మంత్రి కేటీఆర్

మిషన్ భగీరథ పథకం కేసీఆర్ మానస పుత్రిక అని.. దాన్నే స్పూర్తిగా తీసుకొని మోడీ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్‌ను ప్రారంభించిందని మంత్రి కేటీఆర్ చెప్పారు.

అది మా తెలంగాణ పథకం.. మోడీ కాపీ కొట్టారు : మంత్రి కేటీఆర్
X

సీఎం కేసీఆర్ మానస పుత్రిక అయిన మిషన్ భగీరథ పథకాన్ని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కాపీ కొట్టిందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ ద్వారా దేశంలోని 12 కోట్ల ఇళ్లకు మంచి నీటిని సరఫరా చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గోవా, తెలంగాణ, హర్యానా రాష్ట్రాల్లో 100 శాతం ఇళ్లకు మంచి నీరు అందుతోందని తెలిపిందే. అదే సమయంలో పంజాబ్, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, బీహార్‌లో 90 శాతం ఇళ్లకు మంచి నీటి కనెక్షన్లు ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది.

కాగా, ఇదే విషయాన్ని ఉటంకిస్తూ మాజీ సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ ట్విట్టర్‌లో ఒక పోస్టు పెట్టారు. గోవా, తెలంగాణ, హర్యానా రాష్ట్రాలు 100 శాతం ఇళ్లకు పంపుల ద్వారా నీటిని సరఫరా చేయడంపై ఆయన అభినందనలు తెలియ జేశారు. ఏపీలో 18వ స్థానంలో ఉందని కూడా ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు.

లక్ష్మీనారాయణ గారూ.. ఇది తెలంగాణ ప్రభుత్వం సొంతగా చేపట్టిన ప్రాజెక్టు. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోని ఇంటింటికీ మంచి నీటిని పైపుల ద్వారా సరఫరా చేస్తున్నాము. సీఎం కేసీఆర్ మానసపుత్రిక ఈ పథకం. ఈ మిషన్ భగీరథనే స్పూర్తిగా తీసుకొని మోడీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ అని ప్రారంభించినట్లు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

మిషన్ భగీరథకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు శూన్యం. ఎన్నో సార్లు నిధులు కావాలని అడిగినా మొండి చేయి చూపించారు. నీతి ఆయోగ్ స్వయంగా మిషన్ భగీరథకు రూ.19,000 కోట్ల గ్రాంట్ మంజూరు చేయాలని సిఫార్సు చేసినా.. కేంద్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో ఇంటింటికీ మంచి నీటి సరఫరాలో కేంద్ర ప్రభుత్వ ఘనత ఏమీ లేదని.. అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పథకమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.


First Published:  17 May 2023 7:06 PM IST
Next Story