తగ్గిన రేవంత్ సర్కార్..గ్రూప్ - 2 వాయిదా
గ్రూప్ -2 అభ్యర్థుల ఆందోళనలకు తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు తలొగ్గింది. గ్రూప్ - 2ను వాయిదా వేస్తూ అధికారిక ప్రకటన చేసింది.
గ్రూప్ -2 అభ్యర్థుల ఆందోళనలకు తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు తలొగ్గింది. గ్రూప్ - 2ను వాయిదా వేస్తూ అధికారిక ప్రకటన చేసింది. ఆగస్టు 7,8 తేదీల్లో పరీక్షలు జరగాల్సి ఉండగా...డిసెంబర్‌కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది రేవంత్ సర్కార్.
అసలు వివాదం ఏంటి..?
కొద్ది రోజులుగా డీఎస్సీతో పాటు గ్రూప్ - 2 పోస్టులు పెంచి వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనలు కూడా చేశారు. ఐతే డీఎస్సీ అభ్యర్థుల డిమాండ్‌ను పట్టించుకోలేదు రేవంత్ సర్కార్. ఇక గ్రూప్ - 2 విషయానికి వస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 783 పోస్టులతో TSPSC 2022 డిసెంబర్ 29న నోటిఫికేషన్ జారీ చేసింది. 2023 ఆగస్టు, 2024 జనవరిలో పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ ఎన్నికలు, ఇతర కారణాలతో ఆ టైంలో ఎగ్జామ్స్ జరగలేదు. గ్రూప్ - 2 కోసం మొత్తం 5 లక్షల 51 వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు.
ఐతే ఈ ఏడాది ఆగస్టు 7,8 తేదీల్లో ఎగ్జామ్స్ నిర్వహిస్తాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఐతే నోటిఫికేషన్ 2022 డిసెంబర్‌లో ఇచ్చిన కారణంగా...ఇప్పటి ఖాళీల ప్రకారం గ్రూప్ - 2 పోస్టుల సంఖ్య పెంచి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. పరీక్షలను డిసెంబర్‌కు వాయిదా వేయాలని ఆందోళనలు చేశారు. దీంతో ప్రభుత్వ దిగివచ్చి డిసెంబర్‌కు వాయిదా వేయాలని నిర్ణయించింది. ఐతే పోస్టుల సంఖ్య పెంచి కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తారా, లేదా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.