Telugu Global
Telangana

తెలంగాణలో 'టెంట్ సిటీ'లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే..?

తెలంగాణలో కృష్ణా, గోదావరి నదుల వెంట అద్భుతమైన సుందర ప్రదేశాలున్నాయని, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించేవారికి ఆయా ప్రాంతాలు అనుకూలమైనవని చెప్పారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

తెలంగాణలో టెంట్ సిటీలు.. ఎక్కడెక్కడ వస్తాయంటే..?
X

'టెంట్ సిటీ'. పర్యాటక రంగానికి ఇదో కొత్త ఆకర్షణ. పర్యాటకులకు తాత్కాలిక విడిది అవకాశంతోపాటు, ప్రకృతిని ఆస్వాదించే అద్భుతమైన అనుభూతిని కూడా ఈ 'టెంట్ సిటీ'లు కలిగిస్తాయి. ఇలాంటి 'టెంట్ సిటీ'లను తెలంగాణలో కూడా ఏర్పాటు చేస్తామన్నారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. వార‌ణాసిలోని నిరాన్ టెంట్ సిటీని సందర్శంచిన ఆయన, అక్కడి ఏర్పాట్లు చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో కూడా అదే తరహా టెంట్ సిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.

ఎక్కడెక్కడ..?

తెలంగాణలో కృష్ణా, గోదావరి నదుల వెంట అద్భుతమైన సుందర ప్రదేశాలున్నాయని, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించేవారికి ఆయా ప్రాంతాలు అనుకూలమైనవని చెప్పారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనల మేరకు పర్యాటకులను ఆకర్షించే విషయంలో దేశంలోనే తెలంగాణను ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. దానికోసం అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. తెలంగాణలో మహబూబ్‌ నగర్‌ లోని ఎకో టూరిజం పార్క్‌, సోమశిల, అనంతగిరి హిల్స్‌, మల్లన్నసాగర్‌, లక్నవరం వంటి ప్రాంతాలు టెంట్ సిటీ ఏర్పాటుకి అనువుగా ఉన్నాయని పేర్కొన్నారు మంత్రి. ఆయా ప్రాంతాలపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.


కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్, గంగా నది ఒడ్డున ఇసుక తిన్నెలపై నిర్మించిన నిరాన్ టెంట్ సిటీని పరిశీలించారు. ఎకో టూరిజంకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. మంత్రి వెంట పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, టూరిజం కార్పొరేషన్‌ ఎండీ మనోహర్‌ ఉన్నారు.

First Published:  24 April 2023 2:03 AM GMT
Next Story