Telugu Global
Telangana

గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రికత్త

ఆస్పత్రిలో వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయడానికి వెళ్లిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అరెస్ట్‌

గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రికత్త
X

గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య సేవలపై అధ్యయనం కోసం గాంధీ అస్పత్రికి వెళ్లిన బీఆర్‌ఎస్‌ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకులకు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్‌ రాజయ్యతో పాటు ఎమ్మెల్యేలు డాక్టర్‌ సంజయ్‌, మాగంటి గోపీనాథ్‌లతో పాటు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. పోలీసుల వాహనాన్ని అడ్డుకోవడానికి బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు యత్నించారు.

రాష్ట్రంలో ప్రభుత్వం మాతా శిశు మరణానలు దాచిపెడుతున్నదని కొన్నిరోజులుగా బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తున్నది. దీనిపై నిజాలు నిగ్గు తేల్చడానికి, రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య సేవలపై అధ్యయనం కోసం వైద్యులైన బీఆర్‌ఎస్‌ నేతలు డాక్టర్‌ సంజయ్‌, డాక్టర్‌ తాటికొండ రాజయ్య, డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ లతో బీఆర్‌ఎస్‌ కమిటీ ఏర్పాటు చేసింది. వైద్య, ఆరోగ్య సేవలపై నివేదిక ఇవ్వాలని పార్టీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో కమిటీ గాంధీ ఆస్పత్రి పరిశీలించనున్నది. దీన్ని రేవంత్‌ ప్రభుత్వం అడ్డుకున్నది. అనేక నిర్బంధాల మధ్య గాంధీ హాస్పటల్‌కు చేరుకున్న కమిటీ సభ్యులతో పాటు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి బైటికి రాకుండా హౌస్‌ అరెస్టు చేశారు.

ఎందుకింత భయం నీకు రేవంత్‌ ?బీఆర్‌ఎస్‌

బీఆర్‌ఎస్‌ నేతల అరెస్ట్‌లపై బీఆర్‌ఎస్‌ పార్టీ మండిపడ్డింది. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. ఆసుపత్రులను పరిశీలించేందుకు వెళ్తే అరెస్టులా?ఎందుకింత భయం నీకు రేవంత్‌ ? అని మండిపడ్డారు. రాష్ట్రంలో దిగజారిన ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితులను పరిశీలించేందుకు భారత రాష్ట్ర సమితి నియమించిన అధ్యయన కమిటీ అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం డా. తాటికొండ రాజయ్యను, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఎమ్మెల్యే సంజయ్‌, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌, , హైదరాబాద్ పార్టీ నగర అధ్యక్షులు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌లను గాంధీ హాస్పిటల్ వద్ద అడ్డుకొని పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

పిరికిపంద చర్యలకు పాల్పడినా, ప్రజారోగ్య వ్యవస్థలో లోపాలు ఎత్తి చూపుతాం: కేటీఆర్‌

ప్రజా సమస్యలను తెలుసుకోవడంలో ప్రయత్నం చేసిన పార్టీ ఎమ్మెల్యేలను, సీనియర్ నాయకులను అరెస్టు చేయడాన్నిభారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. పోలీసులు వారిని వెంటనే విడుదల చేయాలని, ఆసుపత్రులలోకి వెళ్లకుండా అడ్డంకులు కల్పించవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమం కోసమే, స్వయంగా డాక్టర్లు అయిన మా నాయకులు ఆసుపత్రులను పరిశీలిస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడినా, ప్రజారోగ్య వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపుతామన్నారు.

First Published:  23 Sept 2024 1:28 PM IST
Next Story