సివిల్ కానిస్టేబుల్ నియామకాలకు తాత్కాలిక బ్రేక్
రాష్ట్రవ్యాప్తంగా పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం పోలీసు నియామక మండలి గతేడాది ఏప్రిల్ 25న నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్ కానిస్టేబుల్‌కు సంబంధించి 4,965 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్షలు రాశారు.
తెలంగాణలో సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన రాత పరీక్షలో 4 ప్రశ్నలను తొలగించి తిరిగి మూల్యాంకనం చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆ పరీక్షలో పలు ప్రశ్నలు ఇంగ్లిష్ పదాలతో ఉండటంతో తాము సమాధానాలు రాయలేకపోయామని, దీనివల్ల తాము నష్టపోయామని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ మేరకు న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. దీంతో నియామకాలు జాప్యం కానున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం పోలీసు నియామక మండలి గతేడాది ఏప్రిల్ 25న నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్ కానిస్టేబుల్‌కు సంబంధించి 4,965 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్షలు రాశారు. సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను పోలీస్ నియామక మండలి గత బుధవారం విడుదల చేసింది. అభ్యర్థుల పూర్తి వివరాలను కూడా సేకరిస్తోంది. ఇదిలావుండగా.. రాత పరీక్షలో 3 ప్రశ్నలను తెలుగులోకి అనువాదం చేయకపోవడంతో పాటు ఒక ప్రశ్న తప్పుగా ఇవ్వడంతో సమాధానాలు రాయలేకపోయామని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రశ్నలు ఇంగ్లిష్‌లో ఉండటంతో ఇంటర్ వరకు చదువుకున్న అభ్యర్థులు గందరగోళానికి గురై సమాధానాలు రాయలేక నష్టపోయారని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
దీంతో ఆ 4 ప్రశ్నలను తొలగించి మరోసారి మూల్యాంకనం చేయాలని, ఆ తర్వాత తాత్కాలిక ఎంపిక జాబితా ప్రకటించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రశ్నలను తెలుగులోకి అనువాదం చేయకపోవడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. ఇంగ్లిష్‌లో ఇచ్చిన ఐచ్ఛికాలు వాడుకలో ఉన్నవేనని పోలీసు నియామక మండలి తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. ఇంగ్లిష్ పదాలను తెలుగులో అనువాదం చేసే అవకాశం ఉన్నా.. పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని కోర్టు తప్పబట్టింది. హైకోర్టు తీర్పుతో సివిల్ కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ కాస్త జాప్యం కానుంది.