తెలంగాణలో మండుతున్న ఎండలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ
ఇప్పుడున్న ఉష్ణోగ్రత కన్నా 2, 3 డిగ్రీలు పెరిగే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ విపత్తుల నిర్వహణ సంస్థ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
మార్చి నెల కూడా పూర్తవక ముందే తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. మంగళవారం ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల్లో అత్యధిక ప్రాంతాల్లో టెంపరేచర్ 40 డిగ్రీలు దాటిపోవడంతో ప్రజలకు అవస్థలు మొదలయ్యాయి. రాబోయే రెండు, మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2,3 డిగ్రీలు పెరిగి 45 డిగ్రీల వరకు చేరవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
జైనథ్, తలమడుగులో 42.3 డిగ్రీలు
మంగళవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్, తలమడుగు మండలాల్లో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఈ వేసవిలో రాష్ట్రంలో ఇదే అత్యధికం. బేల మండలం చప్రాలలో 42.1 డిగ్రీలు, ఆసిఫాబాద్‌లో 42 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి.
రెండు, మూడు రోజుల్లో ఇంకా ఎక్కువ
కాగా రాబోయే రెండు, మూడు రోజుల్లో తెలంగాణలో ఉష్ణోగ్రతలు ఇంకా పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పుడున్న ఉష్ణోగ్రత కన్నా 2, 3 డిగ్రీలు పెరిగే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ విపత్తుల నిర్వహణ సంస్థ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎండలో తిరిగేవారు, ముఖ్యంగా శారీరక శ్రమ చేసేపనివారు ఎండ నుంచి రక్షణగా టోపీనో, తలకు గుడ్డ చుట్టుకోవాలని, తరచుగా నీరు తాగాలని, అత్యవసరమైన పనులు లేనివారు మధ్యాహ్నం ఎండలో తిరగవద్దంటూ హెచ్చరించింది.