తెలంగాణలో పోటీకి నై.. ఇక్కడ టీడీపీ భవిష్యత్తేంటి..!
పదేళ్ల కిందట రాష్ట్ర విభజనతోనే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుపై నీలినీడలు మొదలయ్యాయి. ఆ ఎన్నికల్లో 15 స్థానాల దాకా గెలిచినా.. ఆ ఎమ్మెల్యేల్లో అధిక శాతం టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల్లోకి వెళ్లిపోయారు.
ఉమ్మడి రాష్ట్రంలో అధికార పార్టీగా, ప్రతిపక్షంగా 30 ఏళ్లకు పైగా రాజకీయాల్లో చక్రం తిప్పిన తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో నూకలు చెల్లినట్లేనా? రోజురోజుకీ పార్టీ క్షీణదశకు చేరుకుని.. నాయకులందరూ వేరే పార్టీల్లో చేరిపోవడంతో ఇక ఇక్కడ దుకాణం మూసేయాల్సిందని చంద్రబాబు నిర్ణయానికి వచ్చేశారా? ఏపీలో ఉన్న ఇబ్బందులతోనే తల బొప్పి కడుతుంటే తెలంగాణలో పోటీ చేస్తే సమయం వృథా తప్ప ప్రయోజనం లేదని నిర్ధారణకు వచ్చేశారా?.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయదన్న తాజా ప్రకటనతో రాజకీయ వర్గాలు, ప్రజల్లో తలెత్తుతున్న సందేహాలివి. వీటన్నింటికీ దాదాపు ఒకటే సమాధానం.. అవును.. తెలంగాణలో టీడీపీ పని దాదాపుగా ముగిసినట్లేనన్న వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి.
నాన్చి నాన్చి చెప్పినా విషయం అదేగా!
తెలంగాణలో టీడీపీ బలం రోజురోజుకూ క్షీణిస్తోంది. టీడీపీ ఓటు బ్యాంకు అయిన సామాజిక వర్గాలు, సెటిలర్లు అధికంగా ఉన్న హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో 150 డివిజిన్లకు గాను కేవలం ఒక్కచోట నెగ్గినప్పడే ఆ పార్టీ పతనం ఖరారయిపోయింది. పార్టీ అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎల్.రమణ వంటి నేతలు గులాబీ కండువా కప్పుకొన్నప్పుడే ఇక టీడీపీ పని అయిపోయిందని భావన వ్యక్తమైంది. కాసాని జ్ఞానేశ్వర్ లాంటి సీనియర్ నేతకు పార్టీ పగ్గాలు అప్పగించినా పార్టీని పట్టాలెక్కించడం కాని పని అయింది. అందుకే ఇన్నాళ్లూ నాన్చినా చివరకు పార్టీ ఎన్నికల్లో పోటీ చేయదని తేల్చేశారు.
క్యాడర్ పరిస్థితేంటి?
పదేళ్ల కిందట రాష్ట్ర విభజనతోనే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుపై నీలినీడలు మొదలయ్యాయి. ఆ ఎన్నికల్లో 15 స్థానాల దాకా గెలిచినా.. ఆ ఎమ్మెల్యేల్లో అధిక శాతం టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల్లోకి వెళ్లిపోయారు. ఇక అక్కడి నుంచి పార్టీ నేతలంతా ఇతర పార్టీల వైపు చూడటంతో పార్టీ పతనం దిశగా సాగిపోవడం ప్రారంభమైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో సైకిల్‌కి దారి లేదని అర్థమైపోయింది. అయితే నాయకులు వెళ్లిపోయినా.. ఇన్నాళ్లూ అంటిపెట్టుకున్న క్యాడర్ ఇప్పుడు ఎటుపోతుంది? ఇప్పటికే చాలామంది కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల్లో చేరిపోయిన నేపథ్యంలో మిగిలినవారూ అదే బాట పట్టే అవకాశాలే ఎక్కువ.