Telugu Global
Telangana

మొన్న కాంగ్రెస్ లోకి.. నేడు బీఆర్ఎస్ లోకి..

హస్తం పార్టీ సంబరపడేలోపు... మళ్లీ తిరుగు ప్రయాణాలు కూడా మొదలయ్యాయి. కాంగ్రెస్ లో టికెట్లు ఖరారు కాకముందే ఈ పలాయన వాదాలు ఆ పార్టీకి మరింత తలనొప్పిగా మారాయి.

మొన్న కాంగ్రెస్ లోకి.. నేడు బీఆర్ఎస్ లోకి..
X

తెలంగాణ కాంగ్రెస్ లో చేరికల సంతోషం మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలిపోతోంది. బీఆర్ఎస్ బహిష్కృత కీలక నేతలిద్దరితోపాటు వారి అనుచరగణం అంతా తమవైపు వచ్చారని హస్తం పార్టీ సంబరపడేలోపు... మళ్లీ తిరుగు ప్రయాణాలు కూడా మొదలయ్యాయి. కాంగ్రెస్ లో టికెట్లు ఖరారు కాకముందే ఈ పలాయన వాదాలు ఆ పార్టీకి మరింత తలనొప్పిగా మారాయి.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు.. బీఆర్ఎస్ బయటకు పంపించిన తర్వాత వేర్వేరు మహూర్తాలు చూసుకుని అనుచరులతో కలసి కాంగ్రెస్ లో చేరారు. మాజీ ఎంపీ పొంగులేటితో పాటు, ఆయన ప్రధాన అనుచరుడైన తెల్లం వెంకట్రావు కూడా రాహుల్ గాంధీ సమక్షంలో ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. పినపాక, అశ్వారావుపేట, ఇల్లెందు, కొత్తగూడెం నియోజకవర్గాల్లో తెల్లం వెంకట్రావుకి పలుకుబడి ఉంది, అనుచర గణం ఉంది. భద్రాచలం అసెంబ్లీ టికెట్ ఆశించే ఆయన కాంగ్రెస్ లో చేరారు. కానీ ఆ ఆశ నెరవేరేలా లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేకే కాంగ్రెస్ టికెట్ ఇస్తుందని తేలిపోయింది. దీంతో ఆయన మళ్లీ వెంటనే జంప్ చేస్తున్నారు. ఈరోజు బీఆర్ఎస్ లో చేరేందుకు మహూర్తం ఫిక్స్ చేసుకున్నారు.

పొంగులేటి ప్రధాన అనచరుడు పార్టీ మారడం నిజంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాక్ అని చెప్పాలి. అది కూడా గత నెలలో పార్టీలో చేరి, మరుసటి నెలలో మళ్లీ సొంతగూటి(బీఆర్ఎస్)కి ఆయన చేరాలనుకోవడం విశేషం. ఈ ప్రభావం మిగిలిన నాయకులపై కూడా పడుతుందేమోనని అంచనా వేస్తున్నాయి కాంగ్రెస్ వర్గాలు. అందుకే ఈ వ్యవహారంపై ఆచితూచి స్పందించబోతున్నాయి. మొత్తమ్మీద.. చేరికలపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ కి, ఆ చేరికలే నిరాశ మిగిల్చేలా ఉన్నాయి. పొంగులేటితోపాటు బయటకు వెళ్లిపోయిన నాయకులను ఒడిసిపట్టుకుంటూ.. భద్రాచలంలో తిరిగి బీఆర్ఎస్ ని పటిష్టపరుస్తోంది అధినాయకత్వం.

First Published:  17 Aug 2023 12:19 AM GMT
Next Story