Telugu Global
Telangana

ఇప్పటికైనా మోడీని లీవ్ తీసుకోమని చెప్పు.. బండి సంజయ్ ట్వీట్‌కు కౌంటర్లు

నరేంద్ర మోడీ తన కార్యాలయానికి సెలవు పెట్టారా అంటూ ఇటీవల ఒకరు పీఎంవో ఆఫీసులో ఆర్టీఐ దరఖాస్తు చేశారు.

ఇప్పటికైనా మోడీని లీవ్ తీసుకోమని చెప్పు.. బండి సంజయ్ ట్వీట్‌కు కౌంటర్లు
X

'మీ మోడీ సార్‌ను ఇప్పటికైనా లీవ్ తీసుకోమని చెప్పండి', 'తల్లి చనిపోయిన తర్వాత కూడా డ్యూటీ చేశారంటే.. ఆయన ఫ్యామిలీకి ఇచ్చే రెస్పెక్ట్ ఏంటో తెలుస్తోంది', 'దేశాన్ని దోచుకోవడానికి అహర్నిషలు కష్టపడుతున్నారా?'.. ఇవీ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, జాతీయ కార్యదర్శి బండి సంజయ్‌కి నెటిజన్లు ఇచ్చిన కౌంటర్లు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని బండి సంజయ్ చేసిన ట్వీట్‌పై నెటిజర్లు విరుచుకపడుతున్నారు.

నరేంద్ర మోడీ తన కార్యాలయానికి సెలవు పెట్టారా? అంటూ ఇటీవల ఒకరు పీఎంవో ఆఫీసులో ఆర్టీఐ దరఖాస్తు చేశారు. దీనికి సమాధానంగా ప్రధాని ఏ రోజూ సెలవు తీసుకోలేదని.. 365 రోజులూ ఆయన డ్యూటీలోనే ఉన్నారంటూ సమాధానం వచ్చింది. పీఎంవో దగ్గర అందుబాటులో ఉన్న సమాచారం మేరకు.. గత 9 ఏళ్లలో నరేంద్ర మోడీ ఏనాడూ సెలవు పెట్టలేదని పేర్కొన్నారు. ఈ సమాచారానికి సంబంధించిన లేఖను బండి సంజయ్ ట్వీట్ చేశారు.

'ప్రధాని నరేంద్ర మోడీ చాలా స్పూర్తిదాయకమైన వ్యక్తి. ఇన్నేళ్లలో ఆయన ఏనాడూ సెలవు తీసుకోలేదు. తన తల్లి మరణించిన రోజు కూడా ప్రధాని డ్యూటీలోనే ఉన్నారు. కానీ కొంత మంది నేతలు మాత్రం ట్రెక్కింగ్‌కు వెళ్తుంటారు. ఫార్మ్ హౌస్‌లో గడుపుతుంటారు' అంటూ రాహుల్ గాంధీ, సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి బండి వ్యాఖ్యలు చేశారు. కాగా దీనికి నెటిజన్ల నుంచి తీవ్రమైన వ్యతిరేక స్పందన వచ్చింది.

తల్లి మరణిస్తే హిందూ సాంప్రదాయం ప్రకారం గుండు కొట్టించుకుంటారు. కనీసం అలా కూడా ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. సెలవులు కూడా తీసుకోకుండా కుటుంబానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడో మాకు అర్థం అవుతోందని మరొకరు వ్యాఖ్యానించారు. ట్రెక్కింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిది.. ఫార్మ్ హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటే.. తర్వాత మరింత ఉత్సాహంగా పని చేయవచ్చు. అవేమీ చెడు అలవాట్లు కాదు కదా.. అంటూ మరి కొందరి బండి సంజయ్‌ను తప్పుబట్టారు.

ఆన్ డ్యూటీలోనే టూర్లకు వెళ్తున్నప్పుడు వెకేషన్లు మళ్లీ మోడీకి అవసరమా అంటూ కొందరు ఎద్దేవా చేశారు. ఇప్పుడు తీసుకోకపోయినా పర్లేదు.. ఎందుకంటే రాబోయే రోజులన్నీ ఆయన ఇంట్లో కూర్చోవలసిందే కదా అంటూ మరి కొందరు కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి చాలా రోజుల తర్వాత బండి సంజయ్ మరోసారి ట్రోలర్ల దెబ్బను రుచి చూశారు.


First Published:  5 Sept 2023 4:23 AM GMT
Next Story