Telangana:డాక్టర్లు, ఇంజనీర్లు లా కోర్సు కోసం లైను కట్టారు
మూడేళ్ల లా డిగ్రీ అడ్మిషన్ల కోసం తెలంగాణ స్టేట్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS LAWCET) 2022 రాసిన అభ్యర్థుల్లో 1,864 మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు అర్హత సాధించాగా, 33 మంది వైద్యులు లాసెట్ లో అర్హత సాధించారు.
ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సుల పట్ల చాలా మంది తల్లిదండ్రులు, విద్యార్థులకు క్రేజ్ కొనసాగుతున్నప్పటికీ, అటువంటి ప్రోగ్రామ్‌ల నుండి పట్టభద్రులైన అనేక మంది న్యాయవాద వృత్తిని ప్రత్యామ్నాయంగా ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది.
మూడేళ్ల లా డిగ్రీ అడ్మిషన్ల కోసం తెలంగాణ స్టేట్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS LAWCET) 2022 రాసిన అభ్యర్థుల్లో 2,737 మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లున్నారు. ఇందులో 2,254 మంది పురుషులు, 483 మంది మహిళలు ప్రవేశ పరీక్షలో అర్హత సాధించారు, వీరిలో 1,864 మంది అడ్మిషన్ కోరగా, 908 మందికి సీట్లు కేటాయించబడ్డాయి. 25 మంది పురుషులు, ఎనిమిది మంది మహిళలు సహా 33 మంది వైద్యులు లాసెట్ లో అర్హత సాధించారు. వీరిలో 18 మంది ప్రవేశానికి దరఖాస్తు చేసుకోగా, 13 మంది వివిధ కళాశాలల్లో సీట్లు పొందారు.
ఈ సంవత్సరం అత్యధికంగా లా అడ్మిషన్లు పొందిన వారిలో 954 BCom విద్యార్థులుండగా, 934BSc గ్రాడ్యుయేట్లున్నారు. వీరి తర్వాత స్థానం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లదే.
"నేను సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపరేషన్ అవుతున్నాను. రెండుసార్లు మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాను. TSPSC గ్రూప్-I పరీక్షకు హాజరయ్యాను. ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాను. న్యాయశాస్త్రంలో పట్టా పొందడం వల్ల అడ్మినిస్ట్రేటివ్ స్థాయిలో మరిన్ని ఉద్యోగాలకు నేను అర్హత పొందుతాను" అని ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లాలో అడ్మిషన్ పొందిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కె సృజన్ మౌర్య ఓ ఆంగ్ల పత్రికతో అన్నారు.
సాయి కృష్ణ అనే మరో ఇంజనీరు 2016లో ECEలో పట్టభద్రుడయ్యాక MNCలో పనిచేశాడు. తరువాత పౌల్ట్రీ వ్యాపారాన్ని ప్రారంభించాడు. "పూర్తి సమయం పౌల్ట్రీ వ్యాపారం చేస్తున్నప్పుడు, నేను సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధం కావడం ప్రారంభించాను, ఆ సమయంలో నేను వివిధ చట్టాలు, రాజ్యాంగాన్ని చదివాను. అయితే చట్టంపై పూర్తి అవగాహన పొందడానికి మరింత చదవాలని నిర్ణయించుకున్నాను'' అని ఆదర్శ్ లా కాలేజీలో లా సీటు పొందిన కృష్ణ చెప్పారు.
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లే కాదు, డాక్టర్లు, డెంటిస్ట్‌లు, ఫార్మసిస్టులు, ఆర్కిటెక్ట్ లు కూడా లా కోర్సు చదవడానికి ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.
అనస్థీషియాలో స్పెషలైజేషన్‌తో పోస్ట్-గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత లా కోర్సును అభ్యసించాలని నిర్ణయించుకున్న వైద్యుడు G రాజు మాట్లాడుతూ... "నేను విజయవంతమైన వైద్య విద్యార్థిని. అయితే, ఆరోగ్య రంగంలో ప్రస్తుత పోకడలు సంతోషకరంగా ఏమీ లేవు. కాబట్టి, నేను లా కోర్సును మరొక వృత్తిగా కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. లా కోర్సు చేస్తూనే మెడిసిన్‌ను కొనసాగిస్తాను'' అని చెప్పాడు. ఇతను హైదరాబాద్‌లోని పీఆర్‌ఆర్ లా కాలేజీలో అడ్మిషన్ పొందాడు.
''లా చదవడం వల్ల న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడమే కాకుండా, న్యాయ నిపుణుల సహాయం అవసరమయ్యే అనేక కార్పొరేట్ సంస్థల్లో మంచి అవకాశాలున్నాయి. '' అని TS LAWCET 2022 అడ్మిషన్స్ కన్వీనర్ ప్రొ. పి రమేష్ బాబు తెలిపారు.
మొత్తానికి గతంలో ఎన్నడూ లేనంతగా విద్యార్థులు న్యాయవాద చదువుల వైపు రావడం మంచిపరిణామమే. రేపు ఏ రంగంలో పని చేసినప్పటికీ వీరికి న్యాయ శాస్త్ర పరిజ్ఞానం ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు.