Telugu Global
Telangana

తెలంగాణ కొత్త సచివాలయ భవనాన్ని ఎందుకు నిర్మించాల్సి వచ్చింది ?

పాత‌ సచివలాయాన్ని కూల్చి కొత్త సచివాలయాన్ని నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చింది అనే అంశంపై అధికారులు చాలా వివరంగా సమాధానాలు చెప్తున్నారు. అధికారులు చెప్తున్న దాని ప్రకారం ఇది ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయంకాదు. ఎవరి బుర్రలోంచో ఊడిపడిన ఆలోచన కూడా కాదు.

తెలంగాణ కొత్త సచివాలయ భవనాన్ని ఎందుకు నిర్మించాల్సి వచ్చింది ?
X

తెలంగాణలో మరికొద్ది సేపట్లో ప్రారంభంకానున్న నూతన సచివాలయం నిర్మాణం పై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఓ పార్టీ నిర్మాణంపై మతపరమైన విమర్శలు చేస్తుండగా , మరో పార్టీ అసలు కొత్త నిర్మాణం అవసరమేంటనిప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో పాత‌ సచివలాయాన్ని కూల్చి కొత్త సచివాలయాన్నినిర్మించాల్సిన అవసరం ఏమొచ్చింది అనే అంశంపై అధికారులు చాలా వివరంగా సమాధానాలు చెప్తున్నారు. అధికారులు చెప్తున్న దాని ప్రకారం ఇది ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయంకాదు. ఎవరి బుర్రలోంచో ఊడిపడిన ఆలోచన కూడా కాదు. సచివాలయ అవసరాలే కొత్త నిర్మాణానికి పురికొల్పాయి.

అధికారులు చెప్తున్న వివరాల ప్రకారం...

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పాత సచివాలయం నుంచే పరిపాలన ప్రారంభించింది. అయితే అవసరమైన సౌకర్యాలు, క్యాంటీన్లు, పార్కింగ్ లేకపోవడంతో ఉద్యోగులు, సందర్శకులు అనేక ఇబ్బందులు పడ్డారు. తరచుగా షార్ట్ సర్క్యూట్‌లు కావడం, కాంక్రీట్ ప్యాచ్లు, సీలింగ్‌లోని భాగాలు కూలిపోవడం ఉద్యోగులకు ప్రమాదకరంగా మారింది.కొన్ని బిల్డింగులు కూలిపోయే దశకు చేరుకున్నాయి.

ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి పాత సచివాలయం నిర్మాణ పటిష్టత, ఇతర అంశాలను అధ్యయనం చేయడానికి రోడ్లు & భవనాల శాఖ మంత్రి వి ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. సచివాలయ నిర్మాణ పరిస్థితి బాగాలేదని సబ్ కమిటీ నివేదిక సమర్పించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్ అండ్ బీ ఇంజనీర్ ఇన్ చీఫ్ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. సమగ్ర అధ్యయనం తర్వాత, కమిటీ సచివాలయంలో అనేక లోపాలను గుర్తించి, రాష్ట్ర పరిపాలన అవసరాలకు అనుగుణంగా ఉన్నత ప్రమాణాలతో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని సిఫార్సు చేసింది.

2019 జూన్ 27న కొత్త సచివాలయానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. కొత్త సచివాలయానికి ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌లు డాక్టర్ ఆస్కార్ జి. కాన్సెసావో, డాక్టర్ పొన్ని ఎం. కాన్సెసావో రూపకర్తలుగా నియమితులయ్యారు. డిజైన్‌లను ముఖ్యమంత్రి ఆమోదించిన తర్వాత, షాపూర్జీ పల్లోంజీ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్‌కి కొత్త సెక్రటేరియట్‌ను నిర్మించే కాంట్రాక్ట్‌ను అప్పగించారు.

భవన నిర్మాణానికి రూ.617 కోట్లకు పరిపాలనా ఆమోదం లభించింది. ఇప్పటి వరకు రూ.550 కోట్లు వెచ్చించగా, గతంలో వేసిన అంచనాల కంటే 20 శాతం నుంచి 30 శాతం వరకు నిర్మాణ వ్యయం పెరుగుతుందని అంచనా. జీఎస్టీని 6 శాతం నుంచి 18 శాతానికి పెంచడం ఇందుకు ప్రధాన కారణం. ఫలితంగా నిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరిగాయని అధికారులు తెలిపారు.

First Published:  30 April 2023 8:45 AM IST
Next Story