తొలి ఓటు పడింది.. క్యూలైన్లు కదిలాయి
ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. పోలింగ్ పరికరాలన్నీ సిద్ధంగా ఉన్నాయని నిర్థారించుకున్న అధికారులు మాక్ పోలింగ్ పూర్తి చేసి, అసలు పోలింగ్ మొదలు పెట్టారు. మాక్ పోలింగ్ లో ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా.. అధికారులు వెంటనే వాటిని సవరించారు. అధికారులు, బీఎల్వోలు, అభ్యర్థుల ఏజెంట్ల మధ్య పోలింగ్ ప్రారంభమైంది.
ఉదయం నుంచే క్యూ లైన్లు..
ఉదయాన్నే ఓటర్లు క్యూలైన్లలో నిలబడ్డారు. 119 నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఉదయం పరిస్థితి చూస్తే ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 3.26 కోట్ల మంది ఓటర్లు ఈరోజు తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా.. అందులో పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉన్న నియోజకవర్గం శేరిలింగపల్లి. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 7,32,560 మంది ఓటర్లు ఉన్నారు. ఆ నియోజకవర్గంలో అత్యధికంగా 638 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అతి తక్కువ ఓటర్లు ఉన్న నియోజకవర్గం భద్రాచలం. ఇక్కడ కేవలం 1,48,713 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. అతితక్కువగా భద్రాచలంలో 176 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఎవర్నీ క్యూ లైన్లోకి రానివ్వరు. క్యూలైన్ లోకి వచ్చినవారు మాత్రం 5 గంటలు దాటినా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునే బయటకు వెళ్తారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగుతుంది.
*