Telugu Global
Telangana

తెలుగు రాష్ట్రాల కృష్ణా జలాల వినియోగాన్ని లెక్కించాలని కేఆర్‌ఎంబీని కోరిన తెలంగాణ

తెలంగాణ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ శుక్రవారం కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ ముందు తన వాదనలు వినిపిస్తూ, రెండు రాష్ట్రాల నీటి వినియోగాన్ని లెక్కించడం వల్ల వాస్తవంగా ఎవరు ఎంత నీరు వినియోగిస్తున్నారో తెలుసుకునే వీలుంటుందని పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల కృష్ణా జలాల వినియోగాన్ని లెక్కించాలని  కేఆర్‌ఎంబీని కోరిన తెలంగాణ
X

ప్రస్తుత సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల కృష్ణా జలాల వినియోగాన్ని లెక్కించాలని కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కెఆర్‌ఎంబి)ను తెలంగాణ ప్రభుత్వం కోరింది.

తెలంగాణ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ శుక్రవారం కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ ముందు తన వాదనలు వినిపిస్తూ, రెండు రాష్ట్రాల నీటి వినియోగాన్ని లెక్కించడం వల్ల వాస్తవంగా ఎవరు ఎంత నీరు వినియోగిస్తున్నారో తెలుసుకునే వీలుంటుందని పేర్కొన్నారు.

ప్రస్తుత సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే తన కోటాకు మించి కృష్ణా నీటిని వినియోగించుకుందని, తెలంగాణకు ఇంకా 141 టీఎంసీలు వినియోగించుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి సమావేశానికి హాజరు కాకపోవడంతో త్రిసభ్య కమిటీ సమావేశాన్ని వాయిదా వేసింది. తదుపరి సమావేశం మార్చి మొదటి వారంలో జరిగే అవకాశం ఉంది.

గత ఎనిమిదేళ్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి పంపకాల వివాదాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య 50:50 శాతం నిష్పత్తిలో కృష్ణా నీటిని కేటాయించాని చాలా కాలంగా తెలంగాణ డిమాండ్ చేస్తూ ఉంది.

అయితే 66:34 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య నదిలో నీటి భాగస్వామ్యాన్ని కొనసాగించాలని బోర్డు నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ కూడా ఈ నిష్పత్తిని 70:30 శాతానికి సవరించాలని కోరింది.

First Published:  18 Feb 2023 2:15 AM GMT
Next Story