Telugu Global
Telangana

క్షమాపణ చెప్పాల్సిందే.. అమిత్ షా సభకు ఐక్యవేదిక సెగ..

బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కాకినాడ తీర్మానంతో మోసం చేశామని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పాలని డిమాండ్‌ చేశారు ఐక్యవేదిక నాయకులు. క్షమాపణ చెప్పకపోతే మునుగోడు ఆత్మగౌరవ సభను అడ్డుకుంటామన్నారు.

క్షమాపణ చెప్పాల్సిందే.. అమిత్ షా సభకు ఐక్యవేదిక సెగ..
X

మునుగోడులో ఈరోజు జరగబోతున్న ఆత్మగౌరవ సభను అడ్డుకుంటామని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక స్పష్టం చేసింది. ఈమేరకు ఓ బహిరంగ లేఖ విడుదల చేసింది. బీజేపీకి తెలంగాణపై చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించింది. 1,386 మంది తెలంగాణ పౌరులు ఉద్యమంలో అమరులు కావడానికి కారణం బీజేపీయేనని ఆరోపించింది. ఎన్డీఏ హయాంలోనే రాష్ట్ర విభజన జరిగి ఉంటే తెలంగాణ కోసం ఇంత మంది బలిదానాలు అవసరమయ్యేవి కావని అన్నారు ఉద్యమకారుల ఐక్యవేదిక నాయకులు.

సభను అడ్డుకుంటాం..

బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కాకినాడ తీర్మానంతో మోసం చేశామని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పాలని డిమాండ్‌ చేశారు ఐక్యవేదిక నాయకులు. క్షమాపణ చెప్పకపోతే మునుగోడు ఆత్మగౌరవ సభను అడ్డుకుంటామన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచిన బీజేపీ.. మునుగోడులో ఎవరి ఆత్మగౌరవం కోసం సభ పెడుతుందని ప్రశ్నించారు. ఈ నెల 25న మునుగోడులో తాము పర్యటిస్తామని, బీజేపీ తెలంగాణకు చేసిన ద్రోహాన్ని ప్రజలకు వివరిస్తామని, తెలంగాణ అమరవీరుల ఆశయ సాధనకోసం బీజేపీకి బుద్ధి చెప్పాల్సిన అవసరాన్ని ప్రజలు గుర్తించేలా చేస్తామన్నారు ఐక్యవేదిక నాయకులు. పార్లమెంట్ లో ప్రత్యేక తెలంగాణ కోసం రాజగోపాల్ రెడ్డి చేసిన పోరాటాన్ని తాము శంకించడంలేదని, అయితే బీజేపీలో చేరి ఆయన తప్పు చేస్తున్నారని మండిపడ్డారు.

బండీ.. నీ సంగతేంటి..?

బండి సంజయ్ పాదయాత్రలో కనీసం ఒక్క అమర వీరుడి కుటుంబ సభ్యుడిని అయినా పరామర్శించారా అని ప్రశ్నించారు ఐక్యవేదిక నాయకులు. ఏ ఒక్క తెలంగాణ ఉద్యమకారుడితో అయినా మాట్లాడారా అని నిలదీశారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఈరోజు వరకు.. తెలంగాణకు వచ్చినా కూడా ప్రధాని నరేంద్రమోదీ ఏనాడూ అమరవీరులకు జోహార్లు అర్పించలేదని అన్నారు. కాకినాడ తీర్మానం నుంచి ఇప్పటి వరకు కేవలం తెలంగాణను బీజేపీ తన రాజకీయ లబ్ధికోసమే వాడుకుంటోందని మండిపడ్డారు. బీజేపీలో చేరుతున్న వారంతా తెలంగాణను దోచుకునేందుకు చూస్తున్న దొంగలేనని దుయ్యబట్టారు ఐక్యవేదిక నాయకులు.

First Published:  21 Aug 2022 8:02 AM IST
Next Story