ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు మళ్లీ పెంపు
తెలంగాణ వ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్ చలాన్లు ఉండగా.. ఇప్పటి వరకు 1,52,47,864 చలాన్ల చెల్లింపులు పూర్తయ్యాయి.
తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువుని ప్రభుత్వం మరోసారి పెంచింది. ఫిబ్రవరి 15 వరకు ఈ పొడిగింపు అమలులో ఉంటుందని తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. పొడిగింపు ఉండదని అధికార వర్గాలు మొదట్లో వెల్లడించినా.. ఆ తర్వాత ప్రభుత్వం మాత్రం గడువు పొడిగించడానికే ఆసక్తి చూపించడం విశేషం. చలాన్లు చెల్లించేందుకు ఫిబ్రవరి-15 కొత్త డెడ్ లైన్ గా నిర్ణయించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా డిసెంబర్ 27వ తేదీ నుంచి పెండింగ్ చలాన్లను రాయితీతో చెల్లించేందుకు అవకాశమిచ్చారు. 15రోజులు మాత్రమే ఈ అవకాశం అని చెప్పారు. అప్పటికే పెండింగ్ చలాన్లు బాగానే వసూలయ్యాయి. ఆ తర్వాత జనవరి 10 నుంచి నెలాఖరు వరకు రెండోసారి గడువు విధించారు. ఈరోజే ఆఖరు, ఇకపై పొడిగింపు ఉండదనే ప్రచారంతో చాలామంది పెండింగ్ చలాన్లు కట్టేందుకు ఆసక్తి చూపించారు. అయితే ఇప్పుడు మరోసారి గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విశేషం.
మరో 15రోజులు పొడిగింపు..
తెలంగాణ వ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్ చలాన్లు ఉండగా.. ఇప్పటి వరకు 1,52,47,864 చలాన్ల చెల్లింపులు పూర్తయ్యాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.135 కోట్ల ఆదాయం వచ్చింది. పొడిగింపు ద్వారా మరింత ఆదాయం సమకూరుతుందనే అంచనాలున్నాయి.