Telugu Global
Telangana

తెలంగాణ పర్యాటకం భేష్.. ఊహించని రీతిలో టూరిస్ట్ ల తాకిడి

మెడికల్ టూరిజం కూడా కరోనా తర్వాత బాగా పెరిగినట్టు స్పష్టమవుతోంది. మెడికల్ టూరిస్ట్ లు ఎక్కువగా ఆఫ్రికా దేశాలనుంచి వస్తుండగా.. యూరప్, అమెరికా నుంచి సందర్శకులు, ఐటీ నిపుణులు హైదరాబాద్ కి వస్తున్నారు.

తెలంగాణ పర్యాటకం భేష్.. ఊహించని రీతిలో టూరిస్ట్ ల తాకిడి
X

ఏ రంగంలో పురోగతి చెప్పాలనుకున్నా కరోనాకి ముందు కరోనా తర్వాత అనే పోలిక వస్తోంది. దాదాపుగా మిగతా అన్నిరంగాలు కరోనా తర్వాత పూర్వ స్థితికి చేరుకున్నా, పర్యాటక రంగంపై మాత్రం ఆ ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. దూర ప్రాంతాలు వెళ్లేవారు అక్కడి పరిస్థితులను అంచనావేసిన తర్వాతే కాలు కదుపుతున్నారు. ముఖ్యంగా చైనా పరిసర ప్రాంతాలకు వెళ్లేందుకు పర్యాటకులు ఇంకా ధైర్యం చేయడంలేదు. అయితే భారత్ లో మాత్రం పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ వచ్చేందుకు పర్యాటకులు ఉత్సాహం చూపిస్తున్నారు.

తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే–2023 ప్రకారం 2022–23 మధ్య కాలంలో 68 వేల మందికిపైగా విదేశీ పర్యాటకులు తెలంగాణకు వచ్చారు. దాదాపు 6 కోట్ల మంది ఇతర రాష్ట్రాల వారు తెలంగాణకు పర్యాటకులుగా వచ్చి వెళ్లారు. కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు.. రామప్ప దేవాలయం, కొలనుపాక, యాదాద్రి, భద్రాద్రి.. సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. దీంతో కంప్లీట్ తెలంగాణ టూర్ వేయడానికి పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది.

నాగార్జునసాగర్‌ లోని బుద్ధవనం, చార్మినార్, గోల్కొండ వంటి చారిత్రక కట్టడాలతోపాటు, ముచ్చింతల్‌ లోని శ్రీరామనగరానికి కూడా వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున సందర్శకులు తరలి వస్తున్నారు. విదేశీ టూరిస్టుల్లో ఎక్కువమంది వైద్య సేవలకోసం వస్తున్నట్టు తెలుస్తోంది. అంటే అటు మెడికల్ టూరిజం కూడా కరోనా తర్వాత బాగా పెరిగినట్టు స్పష్టమవుతోంది. మెడికల్ టూరిస్ట్ లు ఎక్కువగా ఆఫ్రికా దేశాలనుంచి వస్తుండగా.. యూరప్, అమెరికా నుంచి సందర్శకులు, ఐటీ నిపుణులు హైదరాబాద్ కి వస్తున్నారు.

కరోనాకి ముందు 2016–17లో అత్యధికంగా 9.5 కోట్ల మందికి పైగా ఇతర రాష్ట్రాలవారు.. 1.6 లక్షల మందికిపైగా విదేశీ పర్యాటకులు తెలంగాణకు వచ్చారు. ఆ గణాంకాలతో పోల్చి చూస్తే ఇప్పటి లెక్కలు కాస్త తక్కువే అయినా, ఏడాదికేడాది వృద్ధి గణనీయంగా పెరుగుతోంది. అత్యల్పంగా 2021–22లో 3.2 కోట్ల మంది స్వదేశీ పర్యాటకులు, 5,917 మంది అంతర్జాతీయ పర్యాటకులు తెలంగాణకు వచ్చారు. ఈ ఏడాది ఆ గణాంకాలు భారీగా పెరిగాయి. స్వదేశీ పర్యాటకుల సంఖ్య 89.84 శాతం పెరగగా, విదేశీ పర్యాటకుల సంఖ్య ఏకంగా 1,056.01 శాతం పెరిగింది.

First Published:  23 Feb 2023 7:08 AM GMT
Next Story