Telugu Global
Telangana

అగ్రిల్యాండ్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ లో తెలంగాణకు అగ్రస్థానం..

తెలంగాణలో సాగునీటి ప్రాజెక్ట్ ల ద్వారా బీడు భూమంటూ లేకుండా పోయింది. రిజర్వాయర్లు, పంట కాల్వలతో ప్రతి ఎకరా సాగులోకి వచ్చింది. దీంతో పంట భూముల రేట్లు పెరిగాయి.

అగ్రిల్యాండ్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ లో తెలంగాణకు అగ్రస్థానం..
X

అగ్రిల్యాండ్ ప్రైస్ ఇండెక్స్ జాబితాలో తెలంగాణకు అగ్రస్థానం దక్కింది. దేశవ్యాప్తంగా వ్యవసాయ భూముల ధరలపై జరిగిన ఓ సర్వేలో తెలంగాణ నుంచి 20 జిల్లాలు జాబితాలో చోటు సంపాదించాయి. తెలంగాణలో ఒక ఎకరం ధరతో.. ఇతర రాష్ట్రాల్లో అలాంటి భూమి 10ఎకరాలు కొనే అవకాశం ఉంది. ఆ స్థాయిలో ఇక్కడ ధరలున్నాయి. ఒకరకంగా పంట పండించే రైతన్నకు ఇది అదనపు ధీమాగా ఉంటుంది.

IIM అహ్మదాబాద్‌, హైదరాబాద్‌ కు చెందిన 'ఎస్‌ ఫార్మ్స్‌ ఇండియా'తో కలసి ఈ సర్వే చేపట్టింది. గ్రామీణ ప్రాంత వ్యవసాయ భూముల ధరలపై అధ్యయనం చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లోని గ్రామీణ జిల్లాల్లో పంటపొలాల ధరలను పరిశీలించింది. మొత్తం 106 జిల్లాలతో 'అగ్రిల్యాండ్‌ ప్రైస్‌ ఇండెక్స్‌' అనే సూచీని తయారు చేసింది.

మల్కాజ్ గిరి మొదటి స్థానం..

అగ్రిల్యాండ్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ సర్వే చేపట్టిన రాష్ట్రాల్లో పంటపొలాల ధర అత్యథికంగా ఉన్న ప్రాంతంగా మల్కాజ్ గిరి మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో యూపీలోని గౌతమ్ బుద్ధ నగర్ ఉంది. మూడో స్థానంలో జగిత్యాల, నాలుగో స్థానంలో రంగారెడ్డి, ఐదో స్థానంలో కరీంనగర్ జిల్లాలు ఉన్నాయి. ఈ జాబితాలో ఉన్న మొదటి 10 జిల్లాల్లో 9 తెలంగాణవే కావడం విశేషం. టాప్ 20లో ఉన్న 13 జిల్లాలు తెలంగాణ నుంచే ఉన్నాయి.

జాతీయ, అంతర్జాతీయ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి భూముల ధరల సూచీలపై ఆధారపడుతుంటాయి. ఇప్పుడు జరిగిన సర్వే IIM అహ్మదాబాద్‌ చేపట్టడంతో దీని విశ్వసనీయతకు ఢోకా లేదు. ఆయా జిల్లాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి ఇది మరింత ఊతం ఇస్తుందని అంటున్నారు నిపుణులు.

ఎందుకింత ధరలు..?

రాష్ట్ర విభజన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం ఏపీకి తరలిపోతుందని అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా తెలంగాణలో ధరలు పెరిగాయి. తెలంగాణలో ఎకరం పొలం, ఏపీలో ఐదెకరాలతో సమానం అన్నట్టుగా మారింది పరిస్థితి. అయితే ఏపీలోనే కాదు, కర్నాటక‌, ఉత్తర ప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి రేట్లు లేవని ఇప్పుడు IIM సర్వేతో తేలింది. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్ట్ ల ద్వారా బీడు భూమంటూ లేకుండా పోయింది. రిజర్వాయర్లు, పంట కాల్వలతో ప్రతి ఎకరా సాగులోకి వచ్చింది. దీంతో పంట భూముల రేట్లు పెరిగాయి. ఆయా ప్రాంతాల్లో ఉన్న నివాస స్థలాల రేట్లు కూడా భారీగా పెరిగాయి. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల ఫలితంగానే భూముల ధరలు యజమానులకు ధీమా కలిగిస్తున్నాయి.

First Published:  11 Oct 2022 9:18 AM IST
Next Story