Telugu Global
Telangana

తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్.. గతేడాది కంటే 15.1 శాతం వృద్ధి

గత ఆర్థిక సంవత్సరం 2021-22లో రూ.2,65,942 తలసరి ఆదాయంతో పెద్ద రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది.

తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్.. గతేడాది కంటే 15.1 శాతం వృద్ధి
X

తలసరి ఆదాయం (పర్ క్యాపిటా ఇన్‌కం)లో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.3,08,732 తలసరి ఆదాయంతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినట్లు కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ శాఖ వెల్లడించింది. రాష్ట్రం ఏర్పడిత తొలి నాటి (2014-15) కంటే ఇది 150 శాతం ఎక్కువని తెలిపింది. 9 ఏళ్ల క్రితం రూ.1,24,104గా ఉన్న తలసరి ఆదాయం ఇప్పుడు మరింతగా పెరిగినట్లు పేర్కొన్నది. ఇక గతేడాదితో పోలిస్తే తలసరి ఆదాయ వృద్ధి రేటు 11 నుంచి 15.1 శాతం మేర పెరిగినట్లు వివరించింది.

గత ఆర్థిక సంవత్సరం 2021-22లో రూ.2,65,942 తలసరి ఆదాయంతో పెద్ద రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. అయితే ప్రభుత్వం స్థిరంగా చేడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలతో ఈ ఆదాయం మరింతగా పెరిగిందని తెలిపింది. 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఢిల్లీ తలసరి ఆదాయం వరుసగా రూ.3,31,112, రూ.3,89,529గా నమోదైంది. అయితే 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఢిల్లీ తలసరి ఆదాయ వివరాలు నమోదు కాలేదు. దీంతో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

కాగా.. తెలంగాణ తర్వాత కర్ణాటక రూ.3,01,673, హర్యానా రూ.2,96,685తో రెండు, మూడూ స్థానాల్లో నిలిచినట్లు స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసెస్ రంగాలు అత్యధికంగా రాణించాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఈ రంగాలకు సంబంధించిన మొత్తం జీవీఏ 21.51 శాతంగా నమోదైంది. అయితే 2022-23 ఆర్థిక సంవత్సరంలో మాత్రం 21.42 శాతానికి వీటి స్థూల విలువ జోడింపు తగ్గిపోయింది. అయినా సరే తలసరి ఆదాయం పెరగడం గమనార్హం. గతంలో రాణించని పలు రంగాలు గతేడాది అభివృద్ధి సాధించడంతోనే తలసరి ఆదాయం మెరుగైనట్లు నిపుణులు తెలిపారు.

First Published:  27 July 2023 7:50 AM IST
Next Story