పేటెంట్ రిజిస్ట్రేషన్‌లో తెలంగాణ 2025 కల్లా టాప్ 3కి చేరుతుంది : సుభోజిత్ సాహా
తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే 2025 కల్లా పేటెంట్స్ రిజిస్ట్రేషన్స్‌లో దేశంలోనే టాప్-3 రాష్ట్రాల్లో ఒకటిగా మారడం మాత్రం ఖాయమని సాహ స్పష్టం చేశారు.

పేటెంట్ హక్కుల రిజిస్ట్రేషన్స్‌లో రాబోయే రెండేళ్లలో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన పెరుగుదల సాధించే అవకాశం ఉందని రిసోల్యూట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ హెడ్ ఆఫ్ లీగల్ సుభోజిత్ సాహ అంచనా వేశారు. ప్రస్తుతం తెలంగాణ పేటెంట్ హక్కుల రిజిస్ట్రేషన్స్‌లో దేశంలోనే 6వ స్థానంలో ఉన్నది. అగ్రస్థానంలో తమిళనాడు ఉండగా.. ఆ తర్వాత మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఇక డిజైనింగ్‌లో తెలంగాణ 13 ర్యాంకులో, ట్రేడ్ మార్క్ ఫైలింగ్స్‌లో 9వ ర్యాంకులో ఉన్నది. ఇది 2021-22 డేటా ప్రకారం చేసిన అనాలసిస్.
యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి చెందిన డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) పరిధిలోని కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్, ట్రేడ్ మార్క్స్, జియోగ్రాఫికల్ ఇండికేటర్స్ ఈ మేరకు నివేదిక విడుదల చేసింది. 2021-22లో తమిళనాడు 5,206 పేటెంట్స్ అప్లికేషన్స్ పంపగా.. మహారాష్ట్ర 4,508. ఉత్తరప్రదేశ్ 3,616, కర్ణాటక 3,171, పంజాబ్ 2,197 అప్లికేషన్స్ పంపించాయి. ఇక తెలంగాణ రాష్ట్రం నుంచి 1,724 దరఖాస్తులు వెళ్లాయి. తెలంగాణ తొలి సారిగా టాప్ 5 నుంచి కిందకు పడిపోయినట్లు సుభోజిత్ సాహ చెప్పారు.
తెలంగాణలో అసాధారణమైన అభివృద్ధి జరుగుతోంది. ఇక్కడికి కొత్త పెట్టుబడులు వస్తున్నాయి. ఎన్నో కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ప్రభుత్వం టీ-హబ్, టీ-వర్క్స్ పేరుతో కొత్త వ్యాపారవేత్తలను సృష్టిస్తోంది. అంతే కాకుండా రాష్ట్రంలో ఫార్మ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పరిశోధన, అభివృద్ధి వేగంగా జరుగుతోంది. ఇంత జరుగుతున్నా.. పేటెంట్స్ రిజిస్ట్రేషన్స్ మాత్రం ఆశించినంత రావడం లేదు. అది కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
కాగా, స్టార్టప్స్ కూడా ఎన్నో మొదలవుతున్నాయి. ఇలాంటి వారి కోసం పేటెంట్ అప్లికేషన్ ఫీజు 75 శాతానికి తగ్గించారు. ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్, ఎంఎస్ఎంఈ, స్టార్టప్స్‌కు ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం అనేక ఆవిష్కరణలు అభివృద్ధి దశలో ఉండటం కూడా పేటెంట్లు ఎక్కువగా ఫైల్ కాకపోవడానికి ఒక కారణం కావొచ్చు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే 2025 కల్లా పేటెంట్స్ రిజిస్ట్రేషన్స్‌లో దేశంలోనే టాప్-3 రాష్ట్రాల్లో ఒకటిగా మారడం మాత్రం ఖాయమని సాహ స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన మౌళిక వసతులు అన్నీ రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని.. యువతకు ఇదొక మంచి అవకాశమని ఆయన అన్నారు.