Telugu Global
Telangana

తెలంగాణలో కొత్త నార్కొటిక్స్ బ్యూరో.. టీ-న్యాబ్ దేశంలోనే మొట్టమొదటిది..

తెలంగాణ రాష్ట్రమంతటికీ సంబంధించి కొత్తగా తెలంగాణ- నార్కోటిక్స్ బ్యూరో (టీ-న్యాబ్) పేరుతో ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేయనున్నారు.

తెలంగాణలో కొత్త నార్కొటిక్స్ బ్యూరో.. టీ-న్యాబ్ దేశంలోనే మొట్టమొదటిది..
X

రాష్ట్రంలో డ్రగ్స్ సంబంధిత కేసులు పెరిగిపోవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. డ్రగ్ పెడ్లర్స్ హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలను టార్గెట్ చేసినట్లు సమాచారం రావడంతో సీఎం కేసీఆర్ సీరియస్‌గా ఉన్నారు. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌కు ఈ డ్రగ్స్ ఒక మచ్చలా మారుతున్నాయి. యువత, విద్యార్థులు ఈ డ్రగ్స్ బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇటీవల ముంబైకి చెందిన ఓ ముఠా.. భారీగా డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నట్లు కూడా తేలింది. దీంతో త్వరలోనే నార్కొటిక్స్‌కు సంబంధించి ప్రత్యేక బ్యూరో ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్-న్యూ) అనే విభాగాన్ని ఏడాది క్రితమే నెలకొల్పి డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే ఈ విభాగం కేవలం నగర పరిధిలో మాత్రమే పని చేస్తోంది. దీంతో తెలంగాణ రాష్ట్రమంతటికీ సంబంధించి కొత్తగా తెలంగాణ- నార్కోటిక్స్ బ్యూరో (టీ-న్యాబ్) పేరుతో సంస్థను ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. మరి కొన్ని రోజుల్లోనే ఈ బ్యూరో పూర్తి స్థాయిలో పని చేయనున్నది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలతో పాటు.. పరిపాలనా అనుమతులతో కూడిన అధికార ఉత్తర్వులు త్వరలోనే వెలువడతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. టీ-న్యాబ్ ఏర్పడితే.. దేశంలోనే నార్కోటిక్స్‌కు సంబంధించి ప్రత్యేక బ్యూరోను ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ రికార్డులకు ఎక్కనున్నది.

ప్రస్తుత సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ టీ-న్యాబ్‌కు హెడ్‌గా ఉండే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నార్కోటిక్ కేసులు టీ-న్యాబ్ విచారణ చేపడుతుంది. ఇందు కోసం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక టీమ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నది. ప్రస్తుతం హెచ్-న్యూకు హెడ్‌గా ఉన్న జి. చక్రవర్తిని టీ-న్యాబ్‌లోకి తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. ఇక టీ-న్యాబ్‌ను ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అలాగే రాష్ట్రంలోని నాలుగు కమిషనరేట్లలో కూడా టీ-న్యాబ్ విభాగం ఉంటుంది. ఇక అవసరమైతే జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల్లో టీ-న్యాబ్‌కు చెందిన ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తున్నది.

మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాల ముప్పు పెరిగిపోతుండటంతో దేశంలో తొలి సారి ఇలాంటి కేసుల కోసం టీ-న్యాబ్‌తో పాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేసిన రాష్ట్రం తెలంగాణే. రాబోయే రోజుల్లో ఈ రెండు బ్యూరోలు కేవలం కేసుల దర్యాప్తును మాత్రమే కాకుండా.. యువతలో అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా చేపట్టనున్నది.

First Published:  6 March 2023 3:54 AM GMT
Next Story