Telugu Global
Telangana

తెలంగాణ: హెటెరో ఫార్మాలోకి దూరిన చిరుతను బంధించి జూకి తరలించిన అటవీ అధికారులు

అటవీ శాఖకు చెందిన నిపుణుల బృందం శనివారం ఉదయం ఫ్యాక్టరీకి చేరుకుని చిరుతను రక్షించేందుకు ఆపరేషన్‌ను ప్రారంభించింది. దాదాపు 4 గంటల ఆపరేషన్ తర్వాత కెమికల్ ఇమ్మొబిలైజేషన్ టెక్నిక్ ఉపయోగించి అటవీ సిబ్బంది పులికి మత్తు మందు ఇచ్చి బంధించగలిగారు.

తెలంగాణ: హెటెరో ఫార్మాలోకి దూరిన చిరుతను బంధించి జూకి తరలించిన అటవీ అధికారులు
X

సంగారెడ్డి జిల్లా గడ్డ పోతారం పారిశ్రామికవాడలోని హెటెరో ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్ లోకి వచ్చిన చిరుతపులిని ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. చిరుతపులి డిసెంబర్ 16, శుక్రవారం రాత్రి ప్లాంట్‌లోకి ప్రవేశించినట్లు సమాచారం. భద్రతా సిబ్బంది గమనించి వెంటనే పోలీసులు, అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. అప్రమత్తం చేశారు.

చిరుత రాత్రంతా ఫ్యాక్టరీలోలోనే ఉండిపోయింది. అటవీ శాఖకు చెందిన నిపుణుల బృందం శనివారం ఉదయం ఫ్యాక్టరీకి చేరుకుని చిరుతను రక్షించేందుకు ఆపరేషన్‌ను ప్రారంభించింది. దాదాపు 4 గంటల ఆపరేషన్ తర్వాత కెమికల్ ఇమ్మొబిలైజేషన్ టెక్నిక్ ఉపయోగించి అటవీ సిబ్బంది పులికి మత్తు మందు ఇచ్చి బంధించగలిగారు. దీన్ని నాలుగు నుంచి ఐదేళ్ల వయస్సు గల మగ చిరుతపులిగా గుర్తించారు.

అటవీ సిబ్బంది చిరుతను పూర్తి వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌కు తరలించారు. చిరుతపులిని పరిశీలనలో ఉంచామని నెహ్రూ జూలాజికల్ పార్క్ అధికారి తెలిపారు. "వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ ఎంఏ హకీమ్ నేతృత్వంలోని 10 మంది సభ్యుల బృందం ఈ ఉదయం 10 గంటల ప్రాంతంలో హెటెరో ఫ్యాక్టరీకి చేరుకుంది. కెమికల్ ఇమ్మొబిలైజేషన్ ద్వారా చిరుతపులిని బంధించారు. చిరుతపులి పరిశీలనలో ఉంది.ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ నిర్దేశించినప్పుడు, పులి ఆరోగ్యంగా ఉన్నప్పుడు అడవిలో వదిలిపెడతాము'' అని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.

ఆపరేషన్ పూర్తి కావడానికి 4 గంటల సమయం పట్టడంతో, ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు జనాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మీడియాను ఉద్దేశించి, ఫార్మా ఫెసిలిటీ వద్ద మేనేజర్ మాట్లాడుతూ, "ప్రమాదం ఉన్నప్పటికీ, మా సిబ్బంది ముందుకు వెళ్లి చిరుతపులి ప్రవేశించిన భవనానికి లాక్ చేశారు. చిరుతపులి ప్రవేశించిన బిల్డింగ్ ప్రస్తుతం ఉపయోగంలో లేదు. అందువల్ల ఇది చిరుతపులి అక్కడికి ఈజీగా రాగలిగింది. అది రద్దీగా ఉండే ప్రదేశం అయితే, చిరుతపులి ఆ ప్రాంతంలోకి ప్రవేశించి ఉండేది కాదు.'' అన్నారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా హెటెరో కేంద్రంలోకి చిరుతపులి ప్రవేశించినట్లు సీసీటీవీలో రికార్డయింది. నవంబర్‌లో నర్సాపూర్ మండలం హెటిరో ఫెసిలిటీ సమీపంలో చిరుతపులి రెండు పశువులపై దాడి చేసింది.

First Published:  17 Dec 2022 3:55 PM GMT
Next Story