9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, భారీ డ్రోన్‌షో
ఏర్పాట్లపై సమీక్షించిన సీఎస్ శాంతికుమారి
ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు వేడుకలు ఈనెల 7, 8, 9 తేదీల్లో నిర్వహిస్తున్నామని సీఎస్ శాంతి కుమారి తెలిపారు. ఈ వేడుకల ఏర్పాట్లపై బుధవారం సెక్రటేరియట్‌లో ఆమె ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. 9న సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణతో పాటు భారీ డ్రోన్, లేజర్, క్రాకర్స్ షోలు నిర్వహిస్తామన్నారు. ఏడో తేదీన వందేమాతరం శ్రీనివాస్, 8న రాహుల్ సింప్లిగంజ్, 9న థమన్ సినీ సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. 9వ తేదీన తెలుగు తల్లి ఫ్లయ్ ఓవర్ నుంచి పీవీ మార్గ్ వరకు ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేసి వివిధ కళారూపాలు ప్రదర్శిస్తామన్నారు. ఫుడ్, హ్యాండీక్రాఫ్ట్స్ సహా వివిధ శాఖలకు చెందిన 120 స్టాళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. యూత్ కోసం సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఉత్సవాలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే అవకాశముందని, ఈ నేపథ్యంలో తాగునీరు, టాయిలెట్లు, భద్రత ఏర్పాట్లు, పార్కింగ్ సదుపాయం సహా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణతల్లి విగ్రహావిష్కరణకు లక్ష మంది హాజరయ్యే అవకాశం ఉండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు శ్రీనివాస రాజు, హోం సెక్రటరీ రవి గుప్తా, స్పెషల్ సీఎస్ లు రామకృష్ణారావు, వికాస్ రాజ్, ప్రిన్సిపల్ సెక్రటరీలు దానకిషోర్, రఘునందన్ రావు, సెక్రటరీలు స్మితా సబర్వాల్, జ్యోతి బుద్ధ ప్రకాశ్, లోకేశ్ కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి, అడిషనల్ డీజీ సంజయ్ కుమార్ జైన్, కలెక్టర్లు అనుదీప్, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.