నేడే టెట్.. గంట ముందే రావాలి, బ్లాక్ ఇంక్ పెన్నే వాడాలి
టెట్ పరీక్షలు జరిగే కేంద్రాల్లో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరు.
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) కి సమయం ఆసన్నమైంది. ఈరోజు రెండు విడతల్లో పరీక్ష జరుగుతుంది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్ష కోసం 1,139 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2,69,557 మంది అభ్యర్థులు హాజరవుతారు. మధ్యాహ్నం 2.30 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్–2 నిర్వహిస్తారు. దీనికోసం 913 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2,08,498 మంది అభ్యర్థులు హాజరవుతారు.
కఠిన నిబంధనలు..
టెట్ పరీక్షలు జరిగే కేంద్రాల్లో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరు. గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఓఎంఆర్ షీట్ పరిశీలన, వివరాల నమోదుకి సమయం కేటాయించాలి కాబట్టి, పరీక్ష సమయానికి ముందే కేంద్రానికి చేరుకోవాలని చెబుతున్నారు. హాల్ టికెట్ లేకపోతే పరీక్ష కేంద్రంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. హాల్ టికెట్ లో ఫొటోలు ప్రింట్ కాకపోతే, ఫొటో అతికించి గెజిటెడ్ ఆఫీసర్ తో సంతకం చేయించాలి, ప్రభుత్వం జారీ చేసిన ఫొటో ఐడెంటిటీ కార్డ్ కూడా వెంట తీసుకుని రావాలి.
బ్లాక్ పెన్ తప్పనిసరి..
అభ్యర్థులు ఒక్కొకరు రెండు బాల్ పాయింట్ బ్లాక్ పెన్నులు వెంట తెచ్చుకోవాలని సూచించారు అధికారులు. ఓఎంఆర్ పత్రంలో వివరాలు బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తోనే నింపాల్సి ఉంటుంది. ఇతర రంగులు వాడినవారు అనర్హులు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాగులు, ఇతర వస్తువులను పరీక్ష కేంద్రం బయటే ఉంచాలి. పరీక్ష సమయం పూర్తయ్యే వరకు అభ్యర్థులెవరూ బయటకు వెళ్లడానికి వీల్లేదు.