గ్రేటర్‌లో బస్సు యాత్ర.. టీ-టీడీపీలో జోష్ తెస్తుందా..?
గ్రేటర్‌లో టీ-టీడీపీ బస్సు యాత్ర సక్సెస్ అవుతుందని కాసాని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాలు, నాలుగు లోక్ సభ స్థానాల్లో మాత్రమే యాత్రకు ప్లాన్ చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల నుంచి తెలంగాణలో రోజురోజుకూ పట్టు కోల్పోతున్న టీడీపీ ఉనికి కోసం పోరాటానికి సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బస్సు యాత్రకు ఏర్పాట్లు చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ నెల 23వ తేదీన యాత్ర ప్రారంభించి, హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా పార్టీ క్యాడర్‌లో జోష్ నింపేందుకు ప్రయత్నిస్తోంది.
పెద్దమ్మ గుడి నుంచి ప్రారంభం
టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులు, అసెంబ్లీ ఇన్‌ఛార్జులతో శుక్రవారం సమావేశమై బస్సు యాత్రపై చర్చించారు. యాత్రకు రూట్ మ్యాప్ సిద్ధమైందని కాసాని చెప్పారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుందని, దీన్ని అధినేత, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రారంభిస్తారని జ్ఞానేశ్వర్ ప్రకటించారు.
సక్సెస్ అవుతుందంటున్న కాసాని
గ్రేటర్‌లో టీ-టీడీపీ బస్సు యాత్ర సక్సెస్ అవుతుందని కాసాని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాలు, నాలుగు లోక్ సభ స్థానాల్లో మాత్రమే యాత్రకు ప్లాన్ చేశారు. పార్టీకి కాస్తో కూస్తో పట్టు మిగిలిందంటే అది మహానగరంలో అనేది టీడీపీ అంచనా. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ సైకిల్‌కు గట్టిగానే పంచర్ పడింది. కేవలం ఒకే ఒక్క కార్పొరేటర్ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ నగరవ్యాప్తంగా చేసే యాత్రకు వచ్చే స్పందనను బట్టి తెలంగాణలో ఎలా ముందుకెళ్లాలనేదానిపై టీ-టీడీపీ ఓ అంచనాకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.