తెలంగాణలో మరో జాబితా రెడీ.. టీటీడీపీ హడావిడి
ఈసారి నందమూరి ఫ్యామిలీ నుంచి కూడా ఎవరూ ఆయనకు దొరికినట్టు లేరు. అయినా సరే తగ్గేది లేదంటున్నారు చంద్రబాబు. అభ్యర్థుల్ని ప్రకటించి, ఆ తర్వాత మేనిఫెస్టో కూడా విడుదల చేస్తారని తెలుస్తోంది.
అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల చేసి తెలంగాణలో బీఆర్ఎస్ పొలిటికల్ హీట్ పెంచింది. 115 స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్, వైరి వర్గాలకు సవాల్ విసిరారు. దాదాపుగా సిట్టింగ్ లకే సీట్లు ఖరారు చేసి షాకిచ్చారు. ఈ దశలో కాంగ్రెస్, బీజేపీ కూడా డైలమాలో పడ్డాయి. దాదాపుగా అందరూ ఆ రెండు పార్టీల జాబితాల గురించే ఎదురు చూస్తున్నారు. అయితే అనుకోకుండా ఇప్పుడు టీడీపీ లిస్ట్ రెడీ అయిందని అంటున్నారు. తెలంగాణకు సంబంధించి టీడీపీ రాజకీయం పరిసమాప్తం అయినా, జాబితాలంటూ చంద్రబాబు హడావిడి మాత్రం తగ్గలేదు. వాడివేడి తెలంగాణ రాజకీయాల్లో టీడీపీ లిస్ట్ అనే ప్రకటన కాస్త కామెడీగా మారింది.
తెలంగాణలో టీడీపీ గతం ఘనంగానే ఉంది, కాదనలేం. ఇప్పుడు ఆ పార్టీకి కనీసం నాయకులు కూడా లేరు. సరైన అభ్యర్థులు దొరుకుతారనే ఆశ కూడా లేదు. కానీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా, ఎక్కడొచ్చినా హడావిడి చేయడం చంద్రబాబుకి అలవాటే. అందుకే తెలంగాణ బరిలో టీడీపీని నిలబెట్టాలని చూస్తున్నారు. 36మందితో తొలి జాబితా సిద్ధం చేశారు. త్వరలో దీనికి సంబంధించిన ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి భేటీ అయ్యారని, అభ్యర్థుల జాబితాను రెడీ చేశారని, వివిధ వడపోతల అనంతరం 36మందిని ఖాయం చేశారని ఆ పార్టీ అనుకూల మీడియా హడావిడి చేస్తోంది. సోషల్ మీడియాలో ఆల్రడీ జోకులు పేలుతున్నాయి. ఎన్ని వడపోతలు పోసినా అసలు తెలంగాణలో టీడీపీకి అభ్యర్థులు ఎలా దొరికారని సెటైర్లు పేలుస్తున్నారు నెటిజన్లు. ఆమధ్య నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని తెరపైకి తెచ్చి హడావిడి చేశారు చంద్రబాబు. ఈసారి నందమూరి ఫ్యామిలీ నుంచి కూడా ఎవరూ ఆయనకు దొరికినట్టు లేరు. అయినా సరే తగ్గేది లేదంటున్నారు చంద్రబాబు. అభ్యర్థుల్ని ప్రకటించి, ఆ తర్వాత మేనిఫెస్టో కూడా విడుదల చేస్తారని తెలుస్తోంది.