తెలంగాణ తల్లి దినోత్సవం.. కాంగ్రెస్ కొత్త సంప్రదాయం
గతంలో తెలంగాణ తల్లి విగ్రహం ఉన్నా కూడా.. అందులో మార్పులు చేర్పులు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. కొత్త విగ్రహాన్ని డిసెంబర్ 9న ఆవిష్కరించి, అదే రోజు తెలంగాణ తల్లి ఉత్సవాలు నిర్వహిస్తారు.
తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని బలంగా ప్రచారం చేసుకోవాలని చూస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కానీ తెలంగాణ సాధన క్రెడిట్ ని బీఆర్ఎస్ నుంచి తీసుకోవడం వారికి సాధ్యం కావడంలేదు. ఈ నెల 2న జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సోనియా గాంధీని తీసుకొచ్చి హడావిడి చేయాలనుకున్నారు. కానీ అది కూడా కుదర్లేదు. ఇప్పుడు సోనియాగాంధీ కోసం ప్రత్యేకంగా మరో కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నారు. తెలంగాణ తల్లి దినోత్సవంగా డిసెంబర్ 9ని డిక్లేర్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి దినోత్సవంపై ప్రత్యేక ప్రకటన చేశారు.
తెలంగాణలో కొత్త సంప్రదాయం తీసుకొస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో ఇకపై ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆ రోజున సచివాలయంలోని అన్ని కార్యాలయాల్లో ఉత్సవాలు చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని వెల్లడించారు. ఉత్సవాలకు సోనియా గాంధీని ఆహ్వానిస్తామన్నారు.
ఇటీవల తెలంగాణ ఆవిర్భావ దినోత్సానికి సోనియాగాంధీని ప్రత్యేకంగా ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీయేనని, ఆమెకు కృతజ్ఞతలు తెలిపేందుకు అది ప్రత్యేక సందర్భం అని భావించారు కాంగ్రెస్ నేతలు. కానీ ఆమె మాత్రం ఆ ఉత్సవాలకు రాలేదు. తాజాగా మరోసారి ఆమెకు ప్రత్యేక ఆహ్వానం పంపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ ఉత్సాహం చూస్తుంటే తెలంగాణ తల్లి ఉత్సవాలను సోనియాకోసమే నిర్వహిస్తున్నారనే కామెంట్లు వినపడుతున్నాయి. గతంలో తెలంగాణ తల్లి విగ్రహం ఉన్నా కూడా.. అందులో మార్పులు చేర్పులు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. కొత్త విగ్రహాన్ని డిసెంబర్ 9న ఆవిష్కరించి, అదే రోజు తెలంగాణ తల్లి ఉత్సవాలు నిర్వహిస్తారు.