Telugu Global
Telangana

మాతాశిశు మరణాల తగ్గింపులో తెలంగాణ ముందంజ.. 200 బెడ్ల ఎంసీహెచ్ ఆసుపత్రి ప్రారంభం

దేశంలోని ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా లేని విధంగా.. మొదటి సారిగా తెలంగాణలో ఎంసీహెచ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని రూ.52 కోట్లతో నిర్మించినట్లు మంత్రి చెప్పారు.

మాతాశిశు మరణాల తగ్గింపులో తెలంగాణ ముందంజ.. 200 బెడ్ల ఎంసీహెచ్ ఆసుపత్రి ప్రారంభం
X

మాతా శిశు మరణాలను తగ్గించడంలో తెలంగాణ ముందంజలో ఉన్నది. దేశంలో తల్లి, శిశు మరణాలను తగ్గిస్తూ.. అతి తక్కువ మరణాలు నమోదవుతున్న మూడో రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. తెలంగాణ ఏర్పడిన నాటికి మాతాశిశు మరణాల రేటు 92 ఉండగా.. తొమ్మిదేళ్లలో 43 శాతానికి తగ్గించాము. దేశ సగటు 97గా ఉండగా.. తెలంగాణలో అంతకంటే తక్కువే నమోదవుతోందని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు చెప్పారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన మదర్ అండ్ చైల్డ్ హెల్త్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ..

దేశంలోని ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా లేని విధంగా.. మొదటి సారిగా తెలంగాణలో ఎంసీహెచ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని రూ.52 కోట్లతో నిర్మించినట్లు మంత్రి చెప్పారు. ఆరోగ్య తెలంగాణ సాధించే లక్ష్యంలో భాగంగా సీఎం కేసీఆర్ వైద్యారోగ్య రంగంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. తొమ్మిదేళ్లలో మన వైద్యారోగ్య సిబ్బంది కృషితో రాష్ట్రంలో మాతాశిశు మరణాలు చాలా వరకు తగ్గిపోయాయని హరీశ్ రావు వెల్లడించారు. తాజాగా ప్రారంభించిన ఎంసీహెచ్ ఆసుపత్రి ద్వారా మదర్ మోర్టాలిటీ రేటు మరింతగా తగ్గే అవకాశం ఉందన్నారు. రాబోయే రోజుల్లో నిమ్స్, అల్వాల్ టిమ్స్‌లో కూడా ప్రత్యేక ఎంసీహెచ్ బ్లాకులు ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు.

గర్బిణిలు ఎవరైనా కిడ్నీ, లివర్, హార్ట్ లేదా ఇతర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. వారిని ఎంసీహెచ్ ఆసుపత్రులకు తరలించి.. క్షేమంగా ప్రసవం జరిగేలా చూస్తామని మంత్రి చెప్పారు. డాక్టర్ల పర్యవేక్షణలో గర్బిణులకు పూర్తి వైద్య సదుపాయాలు ఎంసీహెచ్ ఆసుపత్రుల్లో లభిస్తాయని అన్నారు. ఒకవైపు ఇతర రోగాలకు వైద్యం చేస్తూనే.. కడుపులోని బిడ్డ ప్రాణాలను కూడా కాపాడాలనేదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి హరీశ్ రావు చెప్పారు. గతంలో ఇలాంటి సదుపాయాలు ప్రభుత్వ రంగంలో లేకపోవడం వల్ల.. పేదలు ప్రైవేటు వైద్య చేయించుకోలేక చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ, ఇకపై పేదలు కూడా అత్యున్నత సేవలు పొందే వీలుందని మంత్రి చెప్పారు.

అప్పుడే పుట్టిన శిశువులకు ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే వారిని హైదరాబాద్ తీసుకొని రావడానికి ఇబ్బందులు ఉన్నాయి. అలాంటి వారిని గ్రామీణ ప్రాంతాలు, జిల్లాల నుంచి హైదరాబాద్‌లోని నీలోఫర్ లేదా ఇతర స్పెషాలిటీ ఆసుపత్రులకు తరలించడానికి కొత్తగా నియోనేటల్ అంబులెన్సులను ఈ రోజే ప్రారంభించామని మంత్రి చెప్పారు. 33 జిల్లాలకు 33 నియోనేటల్ అంబులెన్సులు అందిస్తామని చెప్పారు. వీటికి రూ.8.7 కోట్ల వ్యయం అయినట్లు మంత్రి చెప్పారు. ఇందులో నియోనేటల్ ఐసీయూలో ఉండే సౌకర్యాలు అన్నీ ఉంటాయని మంత్రి చెప్పారు.

గాంధీ ఆసుపత్రితో పాటు ప్లేట్ల బురుజులో త్వరలో ఇన్‌ఫెర్టిలిటీ సేవలు ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే గాంధీలోని 8వ అంతస్తును పూర్తిగా ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ విభాగానికి కేటాయించనున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి సర్జరీలు పూర్తి స్థాయిలో అందనున్నట్లు మంత్రి హరీశ్ రావు చెప్పారు. అలాగే గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక డైట్ కిచెన్ ప్రారంభించామని హరీశ్ రావు చెప్పారు. ఈ మోడ్రన్ కిచెన్ కోసం రూ.1.23 కోట్లతో నిర్మించినట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. రోగులకు మెరుగైన, నాణ్యమైన ఆహారాన్ని దీని ద్వారా అందించనున్నట్లు మంత్రి చెప్పారు.

First Published:  20 Aug 2023 1:50 PM IST
Next Story